ఈ నెల రెండోవారంలో పవన్ ఏం చెబుతారు?
‘పవన్‌కల్యాణ్...’ సినీ రికార్డుల పరంగానే కాదు, వ్యక్తిగతంగా కూడా ఈ పేరు సంచలనాలకు కేంద్రబిందువే. ఆయన కెరీర్ మొదలైనప్పట్నుంచీ... వ్యక్తిగతంగా కూడా చాలా విషయాల్లో వార్తల్లో నిలిచారాయన.
ఓ పత్రిక పై నిరసనగా రోడ్డుపై బైటాయించడం, అభిమానుల్ని ఉత్తేజపరుస్తూ... ‘కామన్‌మేన్ ఫోర్స్’ని స్థాపించడం, చిరంజీవికి ‘పద్మభూషణ్’ వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో... పవన్‌కి మరొకరికి జరిగిన మాటల యుద్ధం, ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో ఇతర పార్టీ నాయకుల్ని ఉద్దేశించి పవన్ మాట్లాడిన తీరు, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం... ఇవన్నీ ఆయన్ను వార్తల్లో వ్యక్తిని చేశాయి. అయితే... ప్రస్తుతం ఆయన ఈ వివాదాలన్నింటికీ దూరంగా ఉంటున్నారు. తామరాకుపై నీటి బొట్టులాగే జీవితాన్ని సాగిస్తున్నారు. ఇతర సినిమా వేడుకలకు ఆయన హాజరు కావడం కూడా అరుదైన విషయమే.
పవన్ సున్నిత మనస్కుడు. ఆయన ప్రేమను పంచడం ఏ స్థాయిలో ఉంటుందో, ద్వేషించడం కూడా అదే స్థాయిలో ఉంటుందని పవన్ సన్నిహితులు చెబుతుంటారు. అయితే... ఈ మధ్య చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ల మధ్య దూరం పెరిగిందని ఓ వార్త అటు పరిశ్రమలోనూ, ఇటు ప్రజల్లోనూ వినిపించడం మొదలైంది. దానికి తగ్గట్టే వారిద్దరూ కలిసి కబుర్లు చెప్పుకున్న ఒక్క దాఖాలా కూడా ఎక్కడా కనిపించడం లేదు. దాంతో అది నిజమనే అందరూ భావిస్తున్నారు. రీసెంట్గా జరిగిన వరుణ్‌తేజ్ సినిమా ఓపెనింగ్‌లో కూడా ఇద్దరూ కలిసి కనిపించలేదు.
ఇదే ఓ వైపు పెద్ద హాట్ టాపిక్ అయితే... ఆదివారం మీడియాలో వచ్చిన ఓ వార్త అంతకు మించిన హాట్ టాపిక్ అయ్యింది. పవన్‌కల్యాణ్ పార్టీని స్థాపించబోతున్నారని, రాబోయే ఎన్నికల్లో ఆయన పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేస్తారని, పార్టీకి సంబంధించిన ఇతర విషయాలు త్వరలోనే తెలియజేస్తారని ఆ వార్త సారాంశం. పరిశ్రమలో, ప్రజల్లో, అభిమానుల్లో, మీడియాలో ఆసక్తిని రేకెత్తించిన వార్త ఇది. అయితే... ఆదివారం సాయంత్రం పవన్‌కల్యాణ్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. చిరంజీవికి, పవన్‌కల్యాణ్‌కి మధ్య ఎలాంటి మనస్పర్థలూ లేవని చెబుతూనే... పవన్ పాలిటిక్స్‌పై వచ్చిన వార్తపై కూడా ఓ వివరణను ఈ ప్రకటనలో పొందుపరిచారు. నేటి రాజకీయాలపై పవన్‌కల్యాణ్ అభిప్రాయం కానీ ‘పార్టీ గురించి కానీ ఎన్నికల్లో పోటీ చేసే విషయం గురించి కానీ... తన అభిమతాన్ని ఈ నెల రెండో వారంలో పవన్‌కల్యాణే స్వయంగా తెలియజేస్తారని ఈ ప్రకటన సారాంశం.
ఈ నెల రెండోవారంలో పవన్‌కల్యాణ్ ఏం చెబుతారనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్న విషయం. నిజంగా పవన్ రాజకీయల్లోకి రాబోతున్నారా? పార్టీ పెట్టబోతున్నారా? లేక వేరే ఏదైనా పార్టీలో చేరబోతున్నారా? ఇవన్నీ కాక తనపై వస్తున్న వార్తలన్నీ బోగస్సే అని తేల్చేయబోతున్నారా? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే... ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం గబ్బర్‌సింగ్-2, ఓ మైగాడ్ సినిమాల ప్రీ ప్రొడక్షన్ పనుల్లో పవన్‌కల్యాణ్ బిజీగా ఉన్నారు.