దుబాయ్‌లో తయారైన మణల్
సాధారణంగా కథ డిమాండ్ మేరకు కొన్ని కీలక సన్నివేశాలు, పాటలను విదేశాల్లో చిత్రీకరించడం జరుగుతోంది. అలాంటిది మణల్ నగరం అనే చిత్రం పూర్తిగా దుబాయ్‌లో చిత్రీకరణ పూర్తి చేసుకోవడం విశేషం. బీజేఎం అసోసియేట్స్ పతాకంపై ఎంఐ వసంతకుమార్ నిర్మించిన ఈ చిత్రానికి ఒరుతలై రాగం ఫేం శంకర్ దర్శకత్వం వహించడంతోపాటుగా ముఖ్య పాత్రను పోషించారు. నటుడు ప్రాజన్ హీరోగా, తనిష్కా హీరోయిన్గా నటించారు. మరో హీరోయిన్గా దుబాయ్‌కు చెందిన వరుణ్ చెట్టి నటించారు. ఇంకా ఈ చిత్రంలో ఫిలిఫైన్స్, బంగ్లాదేశ్, దుబాయ్, పాకిస్తాన్, ఇండియా తదితర దేశాలకు చెందిన నటీ నటులు నటించడం మరో విశేషం అని నిర్మాత తెలిపారు.
చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ దుబాయ్‌లో ఎక్కువగా చిత్రాల షూటింగ్‌ను ఎందుకు నిర్వహించరన్న విషయాన్ని తమకు అనుభవపూర్వకంగా అవగతం అయిందన్నారు. అక్కడ చట్ట నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయన్నారు. ప్రతి లొకేషనకు అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని, అక్కడ పోలీసుల హడావుడి ఎక్కువగా ఉంటుందన్నారు. కష్టమైనప్పటికీ తమ చిత్రాన్ని పూర్తి స్థాయిలో ఇష్టంగా నిర్మించామని తెలిపారు. జీవితంలో సాధించాలనుకునే ఒక యువకుని ఇతి వృత్తంగా మణల్నగరం ఉంటుందన్నారు. ఇది ఒక విభిన్న రొమాంటిక్ యాక్షన్ త్రిల్లర్ చిత్రంగా తెలిపారు. ప్రముఖ ఛాయగ్రాహకుడు ప్రియన్ శిష్యుడు జే శ్రీధర్ ఛాయా గ్రహణం, రెనిల్ గౌతం సంగీతం ఈ చిత్రానికి పక్కాబలంగా ఉంటుందన్నారు. ఈ చిత్రాన్ని ఈనెల 27న విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నట్టు తెలిపారు.