తమాషా చేస్తున్నారా..!
► ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
► మూడు రోజుల్లో పరిష్కరించి నివేదికలు ఇవ్వాలి
►ప్రజావాణికి క్లర్కులు.. జూనియర్ అసిస్టెంట్లను పంపడంపై కలెక్టర్ అసహనం
మహబూబ్నగర్ టౌన్: ప్రజలకు అందించడం ఇష్టం లేదా, లేక మాకెందుకులే అనుకున్నారా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అధికారులు ఫిర్యాదులను పరిష్కరించకుండా తమాషాలు చేస్తున్నారా అంటూ జిల్లా కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం స్థానిక రెవెన్యూ సమావేశ మందిరంలో ‘ పరిష్కారం’ ఫోన్ ఇన్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా ఫిర్యాదుదారులు తాము తరచూ ఫోన్ చేస్తూనే ఉన్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఫిర్యాదులు ఎక్కువగా పెండింగ్లో ఉన్న శాఖల అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పరిష్కారం’ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించకుండా పెండింగ్ లో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువగా పెండింగ్లో ఉన్న హౌసింగ్, అర్డబ్ల్యూఎస్, మైనార్టీ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ శాఖల అధికారులు వివరణ ఇవ్వాలని కోరారు. దీనికితోడు సమావేశానికి ఆయూ శాఖల అధికారులకు బదులుగా జూనియర్ అసిస్టెంట్లను పంపడంపై కలెక్టర్ మరింత అగ్రహానికి లోనయ్యారు. సంబంధిత అధికారులు వెంటనే రావాలని ఆదేశిస్తూ వారిని హాల్ నుంచి బయటకు పంపించారు. ఇకపై అధికారులకు బదులుగా ప్రతినిధులను పంపితే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మూడు రోజుల్లో పరిష్కరించాలి.
ఫోన్లో వచ్చే ఫిర్యాదులకు సంబంధించి అన్ని శాఖల అధికారులు మూడు రోజుల్లో పరిష్కరించి బాధితుడికి సమాచారం ఇస్తూ పరిష్కారం ఇన్చార్జీకి నివేదిక అందజేయూలనానరు. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అనంతరం ఫిర్యాదులను స్వీకరించి, వెంటనే పరిష్కరించాలని సంబందిత అధికారులను ఆదేశించారు.
సిడిపిఓపై అగ్రహం
ప్రజావాణి కార్యక్రమానికి ఐసిడిఎస్ పిడి ఇందిర హాజరుకావాల్సి ఉండగా, ఆమెకు బదులుగా సిడిపిఓను పంపించారు. కలెక్టర్కు ఎదురుగా కూర్చున్న సీడిపిఓ న్యూస్పేపర్ చదువుతుండటాన్ని గమనించిన కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడికి ఎందుకొచ్చావ్, ఏం చేస్తున్నావ్, న్యూస్పేపర్, ఫోన్లో మాట్లాడటం చేసేందుకు వచ్చావా అంటూ నిలదీశారు. వెంటనే బయటకు వెళ్లాల్సిందిగా హెచ్చరించారు.