తాత్కాలిక రాజధాని వెనుక బాబు ‘విజన్’
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : రాష్ట్ర రాజధాని ప్రకాశం జిల్లా మార్టూరు - దొనకొండ - గుంటూరు జిల్లా వినుకొండ మధ్య అనుకూలమంటూ శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇచ్చినా దీని అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాజధానిపై చంద్రబాబు ఒక అభిప్రాయానికి వచ్చినందున ఇక్కడ రాజధాని పెట్టడాదనికి ఇష్టపడతారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
రాష్ట్ర విభజన జరగకముందు నుంచి ప్రకాశం జిల్లాను రాజధాని చేయాలన్న డిమాండ్ ముందుకు వచ్చింది. అన్ని అనకూలతలు ఉండటంతో ఈ ప్రాంతం సరైందన్న అభిప్రాయం శివరామకృష్ణ కమిటీ కూడా వ్యక్తం చేయడంతో రాజధాని డిమాండ్ ఊపందుకుంటోంది. ఇప్పటికే కమిటీ నివేదిక ఆధారంగా ప్రకాశం జిల్లాలోనే రాజధాని ఏర్పాటు చేయాలని రాజధాని సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు వినుకొండ రాజారావు డిమాండ్ చేశారు. రాజధానిపై కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికను ఏ మాత్రం పట్టించుకునే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం లేదని మంత్రులు చేస్తున్న ప్రకటనలతో అర్ధమవుతోంది.
శివరామకృష్ణన్ కమిటీ ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చినపుడే తన ప్రాధాన్యతలను స్పష్టంగా చెప్పింది. పంట పొలాలను తీసుకుని రాజధానిని చేయడం సరికాదని, దీనివల్ల ప్రకృతి సమతౌల్యం దెబ్బతింటుందని, తద్వారా ఆహార భద్రతకు కూడా ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. దీని కోసం ఛైనా ఉదంతాన్ని కూడా ఉదహరించింది. గతంలో చైనా పట్టణీకరణ కోసం పంటపొలాలను నాశనం చేసింది. ఆ తర్వాత ఆహార కొరత ఏర్పడటంతో ఇప్పుడు మళ్లీ వ్యవసాయంపై దృష్టిపెట్టిందని కమిటీ సభ్యులు ఆర్మోర్ రవి ప్రకాశం జిల్లా పర్యటనలో స్పష్టం చే సిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కమిటీ నివేదిక ఇవ్వకముందే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హడావిడిగా విజయవాడను తాత్కాలిక రాజధాని ఏర్పాటు వెనుక ఉండే ‘విజన్ ’లో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాంతం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని గతంలోనే కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవిఆర్ కృష్ణారావు నివేదిక పంపిన సంగతి తెలిసిందే.
దొనకొండ ప్రాంతం భౌగోళికంగా రాయలసీమకు దగ్గరగా ఉండటంతో ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే వెనుకబడిన ప్రాంతం కూడా అభివృద్ది చెందే అవకాశం ఉంది. దొనకొండ - మార్టూరు - వినుకొండ ప్రాంతాలను కలిపితే రాయలసీమకు దగ్గరగా ఉండటంతో రాష్టంలోని అన్ని ప్రాంతాలకు దగ్గరగా ఉంటుంది. అసలు కమిటీ నివేదికపై చంద్రబాబు మీడియాను ఎదురు ప్రశ్నలు వేయడంతో బాబు మనసులో మాట మరోలా ఉందన్నది స్పష్టమవుతోంది.