చైర్మన్ కోసం జిల్లా గ్రంథాలయ సంస్థ ఎదురు తెన్నులు
ఒంగోలు కల్చరల్: ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థకు మూడేళ్లుగా చైర్మన్‌తోపాటు పాలకవర్గం లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోంది. పాలనాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. పుస్తకాల కొనుగోలు, ఉద్యోగుల నియామకం, సెస్ బకాయిల వసూళ్లు అటకెక్కాయి. కాంగ్రెస్ హయాంలో చైర్మన్‌గా నియమితులైన ఎస్వి శేషయ్య కేవలం 11 నెలలు మాత్రమే ఆ పదవిలో ఉన్నారు. ఆ తరువాత టీడీపీ ప్రభుత్వం రావడంతో ఆయనను తొలగించారు. 2014 నవంబరు 1 నుంచి చైర్మన్ పోస్టులో ఎవరినీ నియమించలేదు.
నామినేటెడ్ పోస్టు కావడంతో రాజకీయ ప్రాపకం ఉన్న వారినే ఆ పోస్టులో నియమించే అవకాశం ఉంటుంది. అయితే ఎన్నికల సీజన్ సమీపించే దాకా ఆగి ఆఖరి క్షణంలో జరిపే నియామకాల వల్ల పెద్ద ప్రయోజనం ఉండడం లేదు. 1960 పౌర గ్రంథాలయ చట్టం ప్రకారం జిల్లా గ్రంథాలయ సంస్థ పాలకవర్గంలో చైర్మన్‌తో సహా మొత్తం పది మంది సభ్యులుగా ఉంటారు. గ్రంథాలయ సంస్థ సెక్రటరీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా పౌరసంబంధాల అధికారి, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరక్టర్‌తోపాటు మరో ఐదుగురు వివిధ రంగాలకు చెందిన వారిని సభ్యులుగా నియమిస్తారు.
కుంటుపడుతున్న అభివృద్ధి..
జిల్లా గ్రంథాలయ సంస్థకు చైర్మన్‌తోపాటు పాలకవర్గం లేకపోవడంతో పాలనాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయి. అభివృద్ధి కుంటుపడుతోంది. జిల్లా గ్రంథాలయ సంస్థలో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా చైర్మన్‌దే ప్రధాన భూమిక. పుస్తకాల కొనుగోలు, సెస్ బకాయీల వసూలు, ఉద్యోగ నియామకాలు, నిధుల మంజూరు వంటి కీలక నిర్ణయాలన్నీ చైర్మన్‌పైనే ఆధారపడి ఉంటాయి. చైర్మన్ లేకపోవడంతో ప్రతి చిన్న విషయానికి పౌర గ్రంథాలయ శాఖ సంచాలకుల ఆమోదం కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. జిల్లా గ్రంథాలయ సంస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జిల్లా జాయింట్ కలెక్టర్‌ను పర్సన్ ఇన్చార్జిగా నియమించింది.
పలువురు ఆశావహులు..
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి కోసం గతంలో పలువురు తీవ్రంగా ప్రయత్నించారు. తొలుత టీడీపీ నాయకుడు దాసరి వెంకటేశ్వర్లుకు ఆ పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది. ప్రస్తుతం అడ్వొకేట్ ‡శిరిగిరి రంగారావు పేరు వినిపిస్తోంది. మరి అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.
సమర్థులను నియమించాలి..
జిల్లా గ్రంథాలయ సంస్థకు చైర్మన్‌గా ఉన్నత విద్యావంతులతోపాటు ఆ పదవికి వన్నె తెచ్చేవారిని, గ్రంథాలయ వ్యవస్థ పట్ల పూర్తి అవగాహన ఉన్న వారిని, సమర్థులను నియమిస్తే మేలు జరుగుతుందని పలువురు సూచిస్తున్నారు.