నేరం చేసిన 30 ఏళ్లకు తీర్పు
అహ్మదాబాద్: నేరం చేయకున్నా ఒక్కోసారి శీఘ్రంగా శిక్షలకు గురయ్యేవారు కొందరైతే.. నేరం చేసినప్పటికీ దశాబ్దాలు గడిచినా ఆ శిక్షకు గురవ్వకుండా దర్జాగా తిరిగే వ్యక్తులు కొంతమంది. న్యాయవ్యవస్థను తప్పుబట్టలేంగానీ, వారి వద్ద ఉన్న డబ్బు, న్యాయవ్యవస్థలోని లొసుగులు ఉపయోగించుకొని ఇలాంటివి చేస్తుంటారు.
కానీ, చివరకు శిక్ష మాత్రం పడుతుంది. కానీ, ఆలోగా జరగాల్సినవి జరిగిపోతాయి. సరిగ్గా గుజరాత్లో ఓ కేసు విషయంలో ఇదే జరిగింది. కిందిస్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ దోషులకు శిక్ష విధించే సరికి అందులో ఒకరు ఇప్పటికే చనిపోయి ఉండగా మరొకరు నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించబోతున్నాడు. అది కూడా మూడు దశాబ్దాల తర్వాత. అంటే ముప్పయ్యేళ్ల తర్వాతన్నమాట.
పూర్తి వివరాల్లోకి వెళితే..
గుజరాత్లో ప్రకాశ్ త్రివేది, లక్ష్మీచంద్ పర్మార్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీరిద్దరు 1982 నుంచి 1984 మధ్య పోస్ట్మేన్లుగా పనిచేశారు. ఆ సమయంలో మనీ ఆర్డర్లు, పోస్టల్ ఆర్డర్లు, డిమాండ్ డ్రాఫ్టులు, చెక్కులు దొంగిలించడమే కాకుండా నకిలీ ధ్రువపత్రాలు ఉపయోగించి బ్యాంకు ఖాతాలు తెరిచారు. అలా దొంగిలించిన సొమ్మంతా ఆ ఖాతాల్లో జమచేశారు. చివరకు ఈ విషయం బయటకు తెలియడంతో 1986లో కేసు ఫైల్ చేసిన పోలీసులు వారిని అరెస్టు కోర్టుకు అప్పగించగా వారిని జైలులో వేసింది.
అయితే, వారు బెయిల్ సహాయంతో బయటకొచ్చి హైకోర్టులో సవాల్ చేశారు. చివరకు ఈ కేసును సీబీఐ విచారించి వారు నేరం చేసినట్లు కోర్టుకు ఆధారాలతో సహా అందించింది. దీంతో కిందిస్థాయి కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించి నాలుగేళ్లు జైలు జీవితం గడపాలని ఆదేశించింది. అయితే, లక్ష్మీచంద్ పర్మార్ ఇప్పటికే చనిపోగా నాలుగు వారాల్లోగా ప్రకాశ్ త్రివేదిని కోర్టుకు తీసుకురావాలని పోలీసులకు ఆదేశించింది.