వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలి
రామాపురం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు రక్షణయాత్రలో భాగంగా సోమవారం రామాపురంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 58 శాతం మంది ప్రజానీకం వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారన్నారు. కుటుంబ పోషణ భారమై అప్పులు తీర్చలేక గత 15 సంవత్సరాల కాలంలో దేశ వ్యాప్తంగా సుమారు 4.15 లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 26 శాతం పెరిగాయన్నారు. ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించినా ఆచరణలో కరువు సహాయక చర్యలు లేవన్నారు. రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 13 జిల్లాల రైతాంగాలను చైతన్యపరిచేందుకు డిశంబర్ 20న రైతు రక్షణ యాత్ర నిర్వహిస్తుందన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్ర, జిల్లా సహాయ కార్యదర్శి రంగారెడ్డి, సిపీఐ ఏరియా కార్యదర్శి శ్రీనివాసులు, ఎఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు చెండ్రాయుడు, చీకటి పెద్ద క్రిష్ణయ్య పాల్గొన్నారు.
సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలి
ఎర్రగుంట్ల: రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుతో పాటు నిర్మాణంలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన నిధులను ప్రభుత్వం తక్షణమే కేటాయించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఎర్రగుంట్లలోని స్థానిక కార్యలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో సాగు చేసిన పంటలు వర్షభావం వల్ల దెబ్బతిని పోయిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన రెయిన్గన్ల వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు భవానీశంకర్, నారాయణ, ఓబుళరెడ్డి పాల్గొన్నారు.