పిల్లలతో పనిచేయిస్తే రెండేళ్ల జైలు శిక్ష
లావేరు, న్యూస్‌లైన్: 14 ఏళ్లలోపు పిల్లలతో పనిచేయిస్తే రెండేళ్లు జైలు శిక్షతో పాటు 20 వేల జరిమాన విధిస్తామని నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు అధికారి పి.రామకృష్ణారావు హెచ్చరించారు. బాలల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నేషనల్ చైల్డ్ లేబర్, సమగ్ర బాలల పరిరక్షణ పథకం, విద్యాశాఖ, చైల్డ్‌లైన్ శాఖల అధికారులు లావేరు మండలంలో పలు దుకాణాలపై దాడులు చేశారు. సుభద్రాపురం వద్ద అదే గ్రామానికి చెందిన జనార్దన్, కేశవ అనే 14 ఏళ్లలోపు పిల్లలు మద్యం సీసాలను ఏరుతూ కనిపించారు. వారిని పట్టుకుని చిన్న పిల్లలతో పనులు చేయించడంపై తల్లిదండ్రులను మందలించారు. శ్రీకాకుళం నుంచి విజయనగరానికి వెళ్లే టాటా ఏసీ వాహనంలో క్లీనర్‌గా పనిచేస్తున్న 13 సంవత్సరాల బాలుడు ఎస్.అరుణోదయను పట్టుకున్నారు.
వాహనం డ్రైవర్ నక్క వేంకటేశ్వరరావుపై కేసు నమోదు చేశారు. బాలుడు విజయనగరానికి చెందిన వాడు కావడంతో అక్కడి లేబర్ అధికారులకు కేసు బదిలీ చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి రామకృష్ణారావు గ్రామాల్లో ఎక్కడైనా బాల కార్మికులతో పనులు చేయిస్తే తెలియజేయాలని కోరారు. రణస్థలం ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి తులసీలక్ష్మి, అసిస్టెంట్ లేబ ర్ అధికారిణి కిరణ్మయి, సమగ్ర బాలల పరిరిక్షణ పథకం జిల్లా అధికారి కె.వి.రమణ, ప్రాజెక్టు అధికారి లక్ష్మునాయుడు, ఫీల్డ్ అధికారి జె.శ్రీనివాసరావు, ఎంఈఓ ఎం.సీతన్నాయుడు తదితరులు దాడుల్లో పాల్గొన్నారు.