Pramod Mutalik
-
రేప్ చేస్తే చేతులు నరికేయండి: ముతాలిక్
సాక్షి, బెంగళూరు: ‘అత్యాచారానికి పాల్పడిన వారి చేతులు నరికేయండి. వారి కోర్టు ఖర్చులు మేమే భరిస్తాం’ అంటూ శ్రీరామసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. -
రక్తపాతమే
- శ్రీరామ సేనను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు - మహారాష్ర్టలో బీజేపీకి ఓటమి తప్పదు - ప్రమోద్ ముతాలిక్ సాక్షి, బెంగళూరు : హిందు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న శ్రీరామ సేన సంస్థను రద్దు చేస్తే రాష్ట్రంలో రక్తపాతం తప్పదని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రమోద్ముతాలిక్ హెచ్చరించారు. ఇందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. బాగల్కోటేలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీరామ సేన సంస్థకు చట్టబద్దత ఉందని తెలిపారు. అందువల్ల దీనిని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. ఆర్ఎస్ఎస్ పట్ల చలకనగా మాట్లాడటం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దివాళకోరుతనానికి నిదర్శనమని విమర్శించారు. దేశ రక్షణ కోసం కృషి చేస్తున్న సంస్థల్లో ఆర్ఎస్ఎస్ది అగ్రస్థానమని ప్రశంసించారు. మహారాష్ట్రలో బీజేపీ నుంచి వేరు పడిన శివసేన పార్టీ ఎన్నికల్లో గెలుపుకోసం శ్రీరామసేన మద్దతు కోరుతోందని తెలిపారు. హిందుత్వపై కాని, ఆ మతానికి సంబంధించిన సంస్థలకు, ప్రజల సంక్షేమం కోసం బీజేపీ నేతలు ఎలాంటి సహకారం అందించారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. మహారాష్ట్ర సీఎం పీఠంపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్గడ్కరీ కన్నువేశారని, అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడం తథ్యమని జోష్యం చెప్పారు. తాను భాష, సరిహద్దు కోసం కాకుండా హిందు మత పరిరక్షణ కోసం పాటు పడ్డానన్నారు. ఎన్ని ఆటు పోటులు ఎదురైనా ఇకపై ఇదే పంథాలో ప్రయాణిస్తానని ముతాలిక్ పేర్కొన్నారు. -
తోక లేని రామ సైనికుడితో తలనొప్పి
నిన్నటి దాకా నరేంద్ర మోడీని ప్రధాని చేయడమే తన లక్ష్యం అని ప్రకటించిన శ్రీరామ సేన అధినేత ప్రమోద్ ముతాలిక్ ఇప్పుడు మోడీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడమే తన ధ్యేయం అంటున్నాడు. 'రా రమ్మని' తలుపులు తీసి, ఆ వెంటనే 'పో పొమ్మని' తలుపులు మూసిన బిజెపికి గుణపాఠం చెబుతానంటున్నాడు ఈ రామ సైనికుడు. ఇప్పుడు ముతాలిక్ ధార్వాడ్, బెంగుళూరు సౌత్ నుంచి లోకసభకు పోటీ చేయబోతున్నారు. ధార్వాడ్ లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషీ, బెంగుళూరు సౌత్ లో అనంత కుమార్ లు బిజెపి అభ్యర్థులు. వారిద్దరి వల్లే తనకు పార్టీలో చోటు దక్కలేదని, అందుకే వారిద్దరినీ ఓడిస్తానని ముతాలిక్ చెబుతున్నారు. బెంగుళూరులో పెద్దగా పట్టులేకపోయినా, ముతాలిక్ ధార్వాడ్ లో బిజెపిని డామేజీ చేసే అవకాశాలున్నాయి. ధార్వాడ్ లో అతివాద హిందూ ఓట్లు గణనీయంగా ఉన్నాయి. అవి ముతాలిక్ ఖాతాలోకి వెళ్తే బిజెపి ఓడిపోయే ప్రమాదం ఉంది. 'ఎరక్కపోయి కెలుక్కున్నాము బాబోయ్ ఈ తోకలేని రామసైనికుడిని' అని బిజెపి నేతలు తలలు పట్టుకుంటున్నారు. -
రాముడికి ఎస్, రామసేనకి నో
వివాదాస్పద సంస్థ రామసేన భూతం కర్నాటకలో అటు బిజెపిని, ఇటు కాంగ్రెస్ ను పట్టిపీడిస్తోంది. మంగుళూరు పబ్ లో మహిళలపై దాడి చేసిన రామ్ సేన అధినేత ప్రమోద్ ముతాలిక్ బిజెపి పాలిట అప్పుడే నూనెలో వేయించి తీసిన బూరెలా తయారయ్యారు. బిజెపి ఆయన్ని పట్టుకుని చేతులు కాల్చుకోలేదు. అలాగని వదులుకోలేదు ముతాలిక్ ని చేర్చుకోగానే బిజెపి పై విమర్శల వర్షం కురిసింది. ఆయన్ని పార్టీలో చేర్చుకున్న నాలుగు గంటల్లోనే ఆయన ప్రాథమికసభ్యత్వాన్ని కూడా రద్దు చేయాల్సి వచ్చింది. బిజెపిని ముతాలిక్ విషయంలో చాలా ఘాటుగా విమర్శించిన కాంగ్రెస్ కూడా గుట్టు చప్పుడుకాకుండా ముతాలిక్ కుడిభుజం దినకర్ షెట్టిని పార్టీలో చేర్చేసుకుంది. దినకర్ కూడా మంగుళూరు పబ్ దాడి కేసులో ప్రధాన నిందితుడే. పైగా ఆయన్ని పార్టీలోచేర్చుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు జనార్దన్ పూజారి, ఆస్కర్ ఫెర్నాండెజ్ లు పోటాపోటీగా ప్రకటనలు చేశారు. వారి సమక్షంలోనే మహిళలపై దాడి చేసిన మత దురహంకారి కాంగ్రెస్ లో చేరారు. ఆ తరువాత వచ్చిన తీవ్ర విమర్శలలో తడిసిపోయిన కాంగ్రెస్ కేవలం రెండు గంటల్లోనే షెట్టీని పార్టీ నుంచి తొలగించి లెంపలేసుకుంది. దినకర్ షెట్టి బ్యాక్ గ్రౌండ్ తెలియక తాము తప్పు చేశామని ఇప్పుడు సంజాయిషీలు ఇచ్చుకుంటోంది. 'నేను చేస్తే తప్పు.నువ్వు చేస్తే ఒప్పా' అంటూ ఇప్పుడు బిజెపి కాంగ్రెస్ మీద విరుచుకుపడుతోంది. 'రాముడు ఓకే. కానీ రామసేన ఓకే కాదు' అంటున్నాయి పార్టీలు