రాముడికి ఎస్, రామసేనకి నో
వివాదాస్పద సంస్థ రామసేన భూతం కర్నాటకలో అటు బిజెపిని, ఇటు కాంగ్రెస్ ను పట్టిపీడిస్తోంది. మంగుళూరు పబ్ లో మహిళలపై దాడి చేసిన రామ్ సేన అధినేత ప్రమోద్ ముతాలిక్ బిజెపి పాలిట అప్పుడే నూనెలో వేయించి తీసిన బూరెలా తయారయ్యారు. బిజెపి ఆయన్ని పట్టుకుని చేతులు కాల్చుకోలేదు. అలాగని వదులుకోలేదు ముతాలిక్ ని చేర్చుకోగానే బిజెపి పై విమర్శల వర్షం కురిసింది. ఆయన్ని పార్టీలో చేర్చుకున్న నాలుగు గంటల్లోనే ఆయన ప్రాథమికసభ్యత్వాన్ని కూడా రద్దు చేయాల్సి వచ్చింది.
బిజెపిని ముతాలిక్ విషయంలో చాలా ఘాటుగా విమర్శించిన కాంగ్రెస్ కూడా గుట్టు చప్పుడుకాకుండా ముతాలిక్ కుడిభుజం దినకర్ షెట్టిని పార్టీలో చేర్చేసుకుంది. దినకర్ కూడా మంగుళూరు పబ్ దాడి కేసులో ప్రధాన నిందితుడే. పైగా ఆయన్ని పార్టీలోచేర్చుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు జనార్దన్ పూజారి, ఆస్కర్ ఫెర్నాండెజ్ లు పోటాపోటీగా ప్రకటనలు చేశారు. వారి సమక్షంలోనే మహిళలపై దాడి చేసిన మత దురహంకారి కాంగ్రెస్ లో చేరారు.
ఆ తరువాత వచ్చిన తీవ్ర విమర్శలలో తడిసిపోయిన కాంగ్రెస్ కేవలం రెండు గంటల్లోనే షెట్టీని పార్టీ నుంచి తొలగించి లెంపలేసుకుంది. దినకర్ షెట్టి బ్యాక్ గ్రౌండ్ తెలియక తాము తప్పు చేశామని ఇప్పుడు సంజాయిషీలు ఇచ్చుకుంటోంది. 'నేను చేస్తే తప్పు.నువ్వు చేస్తే ఒప్పా' అంటూ ఇప్పుడు బిజెపి కాంగ్రెస్ మీద విరుచుకుపడుతోంది. 'రాముడు ఓకే. కానీ రామసేన ఓకే కాదు' అంటున్నాయి పార్టీలు