బీజేపీకి చెక్ పెట్టేందుకు.. ఆ రెండు పార్టీల పొత్తు?
బెంగళూరు: వచ్చే ఏడాది జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ, జేడీ (ఎస్) పొత్తు పెట్టుకోనున్నాయా? సెక్యులర్ ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు ఈ రెండు పార్టీలు కూటమిగా ఏర్పడనున్నాయా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే చెబుతున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒకప్పుడు.. మాజీ ప్రధాని దేవేగౌడ సారథ్యంలోని జేడీ (ఎస్)లోనే ఉన్నారు. విభేదాల కారణంగా సిద్ధరామయ్య ఆ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరి ముఖ్యమంత్రి అయ్యారు. కాగా ఇటీవల జరిగిన నంజన్‌గూడ్, గుండ్లుపేట్ అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో జేడీ (ఎస్)తో కాంగ్రెస్ అనధికార ఒప్పందం కుదుర్చుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ రెండు చోట్లా కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవాలంటే జేడీ (ఎస్)తో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి పెరుగుతున్నట్టు సమాచారం. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీ (ఎస్) కలిస్తే బీజేపీ విజయం కష్టమని భావన వ్యక్తమవుతోంది.
గతేడాది మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సెక్యులర్ ఓట్లు చీలిపోవడం వల్ల కాంగ్రెస్ రెండు సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. బీదర్‌లో మాత్రం కాంగ్రెస్ గెలవగా, హెబ్బాల్, దేవదుర్గ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ రెండు చోట్లా కాంగ్రెస్, జేడీ (ఎస్) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. జేడీ (ఎస్) మూడో స్థానంలో నిలిచినా భారీ సంఖ్యలో ఓట్లు పడ్డాయి. సెక్యులర్ ఓట్లు చీలడం వల్లే బీజేపీ గెలిచిందని ఇరు పార్టీల నాయకులు అభిప్రాయపడ్డారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్, జేడీ (ఎస్) కూటమిగా ఏర్పడే అవకాశాలను తోసిపుచ్చలేమని బీజేపీ నేత సురేష్ కుమార్ అన్నారు. కాగా కూటమి ఏర్పడే అవకాశం లేదని, ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత బీఎల్ శంకర్ అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునే అవకాశం లేదని జేడీ (ఎస్) సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఎన్నికల సమయానికి కర్ణాటక రాజకీయాలు ఎలా మారుతాయో?