అధికార పార్టీ ఆశ్చర్యకర నిర్ణయం??
- ముందస్తు ఎన్నికలకు సై!
బెంగళూరు: కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌లను విస్మయంలో ముంచెత్తబోతుందా? వచ్చే ఏడాది మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఉండగా.. ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లేందుకు హస్తం సిద్ధమవుతోందా? అంటే విశ్వసనీయంగా ఔననే వినిపిస్తోంది. పైకిమాత్రం కాంగ్రెస్ పార్టీ ఈ ఊహాగానాలను తోసిపుచ్చుతున్నా.. బీజేపీ సీనియర్ నేతలు, ప్రతిపక్షాలు మాత్రం అందుకు అవకాశముందని చెప్తున్నారు.
ఐదేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాతే ఎన్నికలకు వెళుతామని తాజాగా కర్ణాటక పీసీసీ చీఫ్ దినేశ్ గుండురావు చెప్పారు. 2014 ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అప్పటి సీఎం ఎస్‌ఎం కృష్ణ ముందస్తు ఎన్నికలకు వెళ్లి భంగపడ్డారు. ఇప్పుడు ముందస్తుకు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ వెనుకాడేందుకు ఇది ఒక కారణమని చెప్పేవారూ లేకపోలేదు. అయితే, ఇటీవల ప్రధాని మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ మీద అధికంగా ఫోకస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్‌లో జరగాల్సిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను జూలై నుంచి సెప్టెంబర్ నెలలో ముందస్తుగా జరిపే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందస్తు ఎన్నికలకు సీఎం సిద్దరామయ్యను ఒప్పించేందుకు కాంగ్రెస్‌లోని ఓ బలమైన వర్గం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఏకకాలంలో గుజరాత్, ఒడిశా ఎన్నికలకు బీజేపీ చీఫ్ అమిత్‌షా తీవ్రంగా వ్యూహాలు పన్నుతున్న నేపథ్యంలో కర్ణాటకలోనూ ముందస్తు ఎన్నికలకు సిద్ధపడితే.. కమలానికి షాక్ ఇచ్చినట్టు అవుతుందని ఆయా నేతలు సీఎంకు నూరిపోస్తున్నారు.
గుజరాత్, ఒడిశా ఎన్నికలతో షా తీరికలేకుండా ఉన్న సమయంలోనే కర్ణాటకలో ఎన్నికలకు వెళితే.. అప్పుడు బీజేపీకి ముందస్తు వ్యూహరచనకు, ప్రచారానికి తగినంత వెసులుబాటు ఉండదని వారు చెప్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవల జరిగిన నంజనగూడ, గుండ్లుపేట ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల విజయం ఊపులోనే ముందస్తు ఎన్నికలకు వెళితే పార్టీకి కలిసి వస్తుందని, పార్టీ శ్రేణులు కూడా మరింత ఉత్సాహంతో పనిచేస్తారంటూ కాంగ్రెస్ నేతలు సీఎంను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కర్ణాటకలో ముందస్తు ఎన్నికలకు అవకాశం కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.