విద్యార్థి అనుమానాస్పద మృతిపై విచారణ
ఏరియా ఆస్పత్రిలో విద్యార్థి సంఘాల ఆందోళన
వీడియో చిత్రీకరణతో మృతదేహానికి పోస్టుమార్టం
పాఠశాలలో విద్యార్థులను విచారించిన అధికారులు
మహబూబాబాద్ టౌన్ : మానుకోటలోని మహర్షి విద్యాలయంలో ఆరోతరగతి విద్యార్థి మునిగడప ప్రణయ్ ఆదిత్య(11) అనుమానాస్పద మృతిపై అధికారులు విచారణ చేపట్టారు. ప్రణయ్ ఆదిత్య గురువారం రాత్రి అదే పాఠశాలలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన విషయం తెలిసిందే. విద్యార్థి మృతికి పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, కుల, ప్రజాసంఘాలు, మృతుడి బంధువులు ఆందోళన నిర్వహించాయి.
దీంతో ఆర్డీఓ మధుసూదన్‌నాయక్ ఇచ్చిన హామీ మేరకు తహసీల్దార్ శ్రీరాం మల్లయ్య ఆధ్వర్యంలో టౌన్ సీఐ పింగిళి నరేశ్‌రెడ్డి, డివిజన్ ఉపవిద్యాధికారి డాక్టర్ ఏ రవీందర్‌రెడ్డి, ఎంఈఓ నల్ల లింగయ్య, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ భీంసాగర్, తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో వైద్యులు దేవేందర్, వెంకటేశ్వర్లు ఆ విద్యార్థి మృతదేహానికి వీడియో చిత్రీకరణ మధ్య శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించా రు.
ఈ సందర్భంగా సీఐ పింగిళి నరేశ్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు. ఉదయమే డిప్యూటీ డీఈఓ ఏ రవీందర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీరాం మల్లయ్య, ఎంఈఓ నల్ల లింగయ్యతో కలిసి మహర్షి విద్యాలయానికి వెళ్లి మృతిచెందిన విద్యార్థి తోటి పిల్లలను, ఇతర విద్యార్థులను విచారించామన్నారు. తహసీల్దార్ శ్రీరాం మల్లయ్య మాట్లాడుతూ పోస్టుమార్టం వీడియోను కలెక్టర్‌కు పంపిస్తామని చెప్పారు.