వైద్యరంగానికి స్ఫూర్తిదాయకం
కోవెలకుంట్ల/ రూరల్: హోమియో వైద్య పితామహుడు డాక్టర్ హానెమన్ విగ్రహం మారుమూల గ్రామమైన గుళ్లదూర్తి ఏర్పాటు చేయడం వైద్యరంగానికి గర్వకారణమని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రామాచారి అన్నారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఆదివారం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హానెమన్ విగ్రహం సొంత గ్రామంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచన డాక్టర్ ప్రసాద్‌రెడ్డికి రావడం అభినందనీయమన్నారు. వైద్య రంగానికే ఇది స్ఫూర్తిదాయకమన్నారు.
హోమియో వైద్యం అన్ని విధాలుగా అభివృద్ధి చెంద టానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి హామీ ఇచ్చారు. బనగానపల్లె నియోజకవర్గంలో క్లినిక్ ఏర్పాటు చేస్తే అందుకు కావాల్సిన సహా యాన్ని చేస్తానన్నారు. ఏ వృత్తినైనా దైవం గా భావించి పనిచేస్తే పేరు ప్రఖ్యాతులు వస్తాయని సినీ దర్శకుడు రామచంద్రారావు అన్నారు. తన తండ్రి కాతా అయ్యపురెడ్డి జిల్లాలో మొదటిసారిగా హోమియో వైద్యాన్ని వ్యాప్తి చేశారని డాక్టర్ ప్రసాద్‌రెడ్డి గుర్తు చేశారు. తండ్రి జ్ఞాపకార్థం తనకు జన్మనిచ్చిన గడ్డలో వైద్యపితామహుడు విగ్రహాన్ని ఏర్పాటు చేశానన్నారు.
హోమియోతో సైనస్ నయం
సినీ నటుడు సునీల్ తన ప్రసంగంతో జనాలను ఉర్రూతలూగించారు. చమక్కులు, జోకులతో జనాలను కడుపుబ్బా నవ్వించారు. కోనసీమవాసులకు కంగారెక్కువని, రాయలసీమ వాసులకు ధైర్యమెక్కువని అభిప్రాయపడ్డారు. తాను సినీ రంగంలోకి రాకమునుపు డయాగ్నటిక్ సెంటర్లో నెలకు రూ. 1200 వేతనంతో పనిచేసేవాడినని చెప్పారు. డాక్టర్ వద్దకు వచ్చే వృద్ధ రోగులను త్వరగా వైద్యం అందాలన్న ఉద్దేశంతో మొదటి పది నంబర్లు అలాగే ఉంచేవాడినన్నారు.
పెద్దల ఆశీస్సులతోనే తాను సినీ రంగంలో రాణిస్తున్నానని పేర్కొన్నారు. సినిమా షూటింగ్ సందర్భంగా రాయలసీమలో సైకిల్ తొక్కిన అనుభవం ఉందని గుర్తుచేశారు. తాను సైనస్‌తో ఇబ్బంది పడుతుండేవాడినని, హోమియో డాక్టర్ సాయిప్రసాదరెడ్డి వైద్యంతో దాని నుంచి విముక్తి కలిగిందని తెలిపారు. కార్యక్రమంలో సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ఉస్మానియా యూనివర్సి మాజీ వైస్ చాన్స్‌లర్ భూమయ్య, రిపోర్టర్ ఎడిట ర్ సాయికుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.