Prasad Devineni
-
నిరుత్సాహం... వివాదం
ఈ ఏడాది జాతీయ అవార్డుల ప్రదానోత్సవం వివాదంగా మారింది. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పలువురు విజేతలు పాల్గొనలేదు. దానికి కారణం కేవలం 11 మంది విజేతలకు మాత్రమే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అవార్డు ప్రదానం చేయడం. సమయం లేని కారణంగా మిగతావారికి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి స్మృతీ ఇరానీ అవార్డులు అందజేశారు. వివాదం కావడానికి కారణం ఇదే. రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవాల్సిన అవార్డు కేంద్ర మంత్రి చేతుల మీదుగా అందుకోవడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు గైర్హాజరు అయ్యారని సమాచారం. వాస్తవానికి అవార్డు ప్రదానోత్సవానికి ముందు రోజు రిహార్సల్స్ జరుగుతాయి. అక్కణ్ణుంచే వివాదం మొదలైందని భోగట్టా. రిహార్సల్స్ సజావుగా జరగలేదని కొందరు వాపోయారని తెలిసింది. ఇక.. జాతీయ అవార్డు ప్రదానోత్సం విషయానికొస్తే.. దాదాపు 137 మంది విజేతలు ఉండగా, అందులో సుమారు 75 మంది ‘బాయ్‌కాట్’ చేయాలనుకున్నారట. 11 మందికి రాష్ట్రపతి ఇస్తే, మిగతావాళ్లకు స్మృతీ ఇరానీ అందజేశారు. ‘‘విజేతలందరూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకోవాలనుకున్నాం. కానీ రామ్నాథ్గారు 11 మందికి మాత్రమే అవార్డులు ఇస్తారని తెలిసింది. రాష్ట్రపతి అందుబాటులో లేకపోతే ఉపరాష్ట్రపతితో అయినా అవార్డులను ఇప్పించాలి. అంతే కానీ ఇలా కేంద్రమంత్రి చేతుల మీదుగా కాదు’’ అని బెస్ట్ కన్నడ ఫిల్మ్ విభాగంలో ‘హెబ్బెట్టు రామక్క’ చిత్రానికి జాతీయ అవార్డు గెలుచుకున్న డైరెక్టర్ నంజుండే గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘దీనిని మేం అవమానంగా భావిస్తున్నాం. దాదాపు 70మంది అవార్డు విజేతలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలనుకున్నారు’’ అని మరాఠీ ఫిల్మ్ (‘దప్పా’) డైరెక్టర్ ప్రకాశ్ ఓక్ పేర్కొన్నారు. విజేతల మనోభావాలు ఇలా ఉండగా.. ‘‘రాష్ట్రపతి ఈ కార్యక్రమానికి గంట సమయాన్ని మాత్రమే కేటాయిస్తారని ముందే చెప్పాం. రిపబ్లిక్ డే, కొన్ని ముఖ్యమైన మీటింగ్స్‌ను మినహాయిస్తే మిగిలిన కార్యక్రమాలకు రాష్ట్రపతి కేవలం గంట సమయాన్ని మాత్రమే కేటాయిస్తారు’’ అని రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీ అశోక్ మాలిక్ తెలిపారు. కాగా, రాష్ట్రపతి అవార్డు ప్రదానం చేయాలనుకున్న 11 మందిలో బెంగాలీ యాక్టర్ రిథీసేన్ ఒకరు. అయితే కారణం బయటకు రాలేదు కానీ ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారట. అవార్డులు సాధించిన ఓ విజేత.. రాష్ట్రపతి 11మందికి మాత్రమే అవార్డు ప్రదానం చేస్తారని ముందు రోజే స్పష్టం చేశారని ఓ న్యూస్ ఏజెన్సీతో పేర్కొన్నారు. మరి.. ఇంత వివాదం జరుగుతుంటే స్మృతీ ఇరానీ స్పందించలేదా? అంటే.. ‘‘అవార్డు ప్రదానం తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నవారి దగ్గరకు వచ్చి.. ఇది రాష్ట్రపతి కార్యాలయం తీసుకున్న నిర్ణయం కాబట్టి నేనేం చేయలేను’’ అని పేర్కొన్నారని ఓ ఫిల్మ్ మేకర్ అంటున్నారు. మన తెలుగు పరిశ్రమ నుంచి ‘బాహుబలి 2’కిగాను నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్ దేవినేని, ‘ఘాజీ’ చిత్రానికి పీవీపీ అవార్డులు అందుకున్నారు. -
బాహుబలి నిర్మాతల నుంచి మరో ఫాంటసీ
తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన సినిమా బాహుబలి. మన మార్కెట్ వంద కోట్లకు కూడా చేరని సమయంలో 250 కోట్ల బడ్జెట్ తో సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు ఈ చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని. నిర్మాణంతో పాటు ప్రమోషన్ విషయంలో కూడా పక్కా ప్లానింగ్‌తో వ్యవహరించిన బాహుబలి నిర్మాతలు తెలుగు సినిమా కలెక్షన్ల స్టామినాను నేషనల్ లెవల్‌కు తీసుకెళ్లారు. అదే ఫార్ములాను తమ నెక్ట్స్ సినిమా విషయంలో కూడా ఫాలో అవుతున్నారు ఆర్కా మీడియా మేకర్స్. బాహుబలి తరువాత తమ బ్యానర్లో మరో భారీ ఫాంటసీ సినిమాకు రెడీ అవుతున్నారు. శర్వానంద్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తనయుడు కేయస్ ప్రకాష్ దర్శకత్వంలో సినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమాను 40 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిస్తున్నారట. కేవలం 20 కోట్ల మార్కెట్ మాత్రమే ఉన్న శర్వా హీరోగా, ఇంత వరకు ఒక్క హిట్ కూడా లేని ప్రకాష్ దర్శకత్వంలో భారీ చిత్రాన్ని ఎనౌన్స్ చేసి మరోసారి తమ గట్స్ చూపించారు. గతంలో ప్రకాష్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ ఫాంటసీ సినిమా అనగనగా ఓ ధీరుడు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. -
‘బాహుబలి’పై ఐటీ దాడులు
-
‘బాహుబలి’పై ఐటీ దాడులు
హైదరాబాద్: బాహుబలి సినీ నిర్మాతలు, కార్యాలయాలపై శుక్రవారం మధ్యాహ్నం ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. రాత్రి పొద్దుపోయే వరకు తనిఖీలు కొనసాగాయి. ఆర్కా మీడియా పతాకంపై నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కార్యాలయం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నం.2 ఉండగా, నిర్మాత శోభు యార్లగడ్డ నివాసం ఫిలింనగర్లో, మరో నిర్మాత ప్రసాద్ దేవినేని ఇల్లు జూబ్లీహిల్స్‌లో ఉంది. 25 మంది ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి ఈ మూడు చోట్ల ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఇందులో రూ.60 కోట్ల మేర రద్దయిన పాత నోట్లను గుర్తించినట్లు సమాచారం. అలాగే సినిమాకు సంబంధించిన రశీదులు, కీలక పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పన్ను చెల్లించకుండా ఎగ్గొడుతున్నట్లు ధృవీకరించే కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. వివరాలను ఆర్కా మీడియా కార్యాలయ మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు. గంటల తరబడి ఐటీ అధికారులు ఓ బడా సినిమాకు సంబంధించిన నిర్మాతలపై దాడులు నిర్వహించడం టాలీవుడ్‌ను కుదిపేసింది. ఈ వ్యవహారం నిర్మాతలు, దర్శకులు, హీరోల్లో చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉండగా ఐటీ అధికారులు దాడులు చేస్తున్న సమయంలో శోభు యార్లగడ్డ ఇక్కడ లేనట్లు సమాచారం. ప్రసాద్ దేవినేని మాత్రం మధ్యాహ్నం వరకు నగరంలో ఉండగా ఐటీ అధికారుల దాడులు తెలుసుకొని ఆయన మకాం మార్చినట్లు తెలుస్తోంది. కాగా ఎంత డబ్బును గుర్తించారు, ఏమేం పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అన్నదానిపై అధికారుల నుంచి స్పష్టత లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పట్టుబడిన డబ్బు రూ.60 కోట్లని పైకి తెలుస్తున్నా... ఇంకా భారీ మొత్తంలోనే దొరికినట్లు సమాచారం. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ కార్యాలయంలో సంచుల కొద్ది డబ్బు ఉందని గుర్తు తెలియని వ్యక్తి ఐటీ అధికారులకు సమాచారం ఇవ్వడంతోనే వారు ఈ దాడులు చేసినట్లు సమాచారం. -
కేరళలో బాహుబలి హంగామా
ఈర్ష్య, ద్వేషం, అధికార దాహం... అన్నదమ్ముల మధ్య ఎలా చిచ్చు పెట్టాయి? మరో కురుక్షేత్రానికి ఎలా కారణమయ్యాయి? అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతోన్న భారీ జానపద చిత్రం ‘బాహుబలి’. మహాభారత కథను పోలి ఉండే కథాంశంతో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, రానా ప్రతినాయకునిగా నటిస్తున్నారు. అనుష్కది ఇందులో కథకు కేంద్ర బిందువులాంటి పాత్ర. అందుకే అనుష్క పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన రెండవ మేకింగ్ వీడియోని నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘భారతీయ సినీ చరిత్రలో చెప్పుకోదగ్గ భారీ చిత్రాల్లో ‘బాహుబలి’ ఒకటిగా నిలుస్తుందని నమ్మకంగా చెప్పగలం. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ‘బాహుబలి మేకింగ్ వీడియో’కి అద్భుతమైన స్పందన వచ్చింది. గురువారం అనుష్క పుట్టిన రోజును పురస్కరించుకొని ‘బిహైండ్ ది సీన్స్’ వీడియోను విడుదల చేశాం. అనుష్క గెటప్, ఆమెకు మేకప్ చేస్తున్న దృశ్యాలు, అనుష్క కాస్ట్యూమ్స్ కోసం డిజైనర్లు వేసిన డ్రాయింగ్స్ ఈ వీడియోలో పొందుపరిచాం. ఈ వీడియోకు నేపథ్య సంగీతం అద్భుతంగా కుదిరింది. ఆర్ఎఫ్సీలో నిర్మించిన అయిదు భారీ సెట్స్‌లో ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేశాం. మూడు వారాల పాటు కేరళలో మరో షెడ్యూల్ చేయబోతున్నాం. చరిత్రలో నిలిచిపోయే సినిమా ‘బాహుబలి’ అవుతుంది’’ అని తెలిపారు. అనుష్క మాట్లాడుతూ- ‘‘రాజమౌళితో రెండోసారి పనిచేయడం ఆనందంగా ఉంది. సన్నివేశాలు అనుకున్నట్లు రావడానికి ఎంతైనా శ్రమిస్తారాయన. ఈ సినిమా కోసం 60 రోజులు షూటింగ్ చేశామంటే నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ఈ సినిమాకు పనిచేస్తుంటే టైమ్ తెలియడం లేదు’’ అన్నారు. ఈ చిత్రానికి కథ: వి.విజయేంద్రప్రసాద్, మాటలు: అజయ్, విజయ్, కెమెరా: కె.కె.సెంథిల్‌కుమార్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, పోరాటాలు: పీటర్ హేయిన్స్, స్టైలింగ్: రమా రాజమౌళి,ప్రశాంతి తిపిర్నేని, సమర్పణ: కె.రాఘవేంద్రరావు, నిర్మాణం: ఆర్కా మీడియా వర్క్స్.