అవార్డు అందుకుంటున్న ప్రసాద్, పీవీపీ
ఈ ఏడాది జాతీయ అవార్డుల ప్రదానోత్సవం వివాదంగా మారింది. గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పలువురు విజేతలు పాల్గొనలేదు. దానికి కారణం కేవలం 11 మంది విజేతలకు మాత్రమే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అవార్డు ప్రదానం చేయడం. సమయం లేని కారణంగా మిగతావారికి కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి స్మృతీ ఇరానీ అవార్డులు అందజేశారు. వివాదం కావడానికి కారణం ఇదే. రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవాల్సిన అవార్డు కేంద్ర మంత్రి చేతుల మీదుగా అందుకోవడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.
కొందరు గైర్హాజరు అయ్యారని సమాచారం. వాస్తవానికి అవార్డు ప్రదానోత్సవానికి ముందు రోజు రిహార్సల్స్ జరుగుతాయి. అక్కణ్ణుంచే వివాదం మొదలైందని భోగట్టా. రిహార్సల్స్ సజావుగా జరగలేదని కొందరు వాపోయారని తెలిసింది. ఇక.. జాతీయ అవార్డు ప్రదానోత్సం విషయానికొస్తే.. దాదాపు 137 మంది విజేతలు ఉండగా, అందులో సుమారు 75 మంది ‘బాయ్‌కాట్’ చేయాలనుకున్నారట. 11 మందికి రాష్ట్రపతి ఇస్తే, మిగతావాళ్లకు స్మృతీ ఇరానీ అందజేశారు. ‘‘విజేతలందరూ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు.
రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకోవాలనుకున్నాం. కానీ రామ్‌నాథ్‌గారు 11 మందికి మాత్రమే అవార్డులు ఇస్తారని తెలిసింది. రాష్ట్రపతి అందుబాటులో లేకపోతే ఉపరాష్ట్రపతితో అయినా అవార్డులను ఇప్పించాలి. అంతే కానీ ఇలా కేంద్రమంత్రి చేతుల మీదుగా కాదు’’ అని బెస్ట్ కన్నడ ఫిల్మ్ విభాగంలో ‘హెబ్బెట్టు రామక్క’ చిత్రానికి జాతీయ అవార్డు గెలుచుకున్న డైరెక్టర్ నంజుండే గౌడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘దీనిని మేం అవమానంగా భావిస్తున్నాం.
దాదాపు 70మంది అవార్డు విజేతలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉండాలనుకున్నారు’’ అని మరాఠీ ఫిల్మ్ (‘దప్పా’) డైరెక్టర్ ప్రకాశ్ ఓక్ పేర్కొన్నారు. విజేతల మనోభావాలు ఇలా ఉండగా.. ‘‘రాష్ట్రపతి ఈ కార్యక్రమానికి గంట సమయాన్ని మాత్రమే కేటాయిస్తారని ముందే చెప్పాం. రిపబ్లిక్ డే, కొన్ని ముఖ్యమైన మీటింగ్స్‌ను మినహాయిస్తే మిగిలిన కార్యక్రమాలకు రాష్ట్రపతి కేవలం గంట సమయాన్ని మాత్రమే కేటాయిస్తారు’’ అని రాష్ట్రపతి ప్రెస్ సెక్రటరీ అశోక్ మాలిక్ తెలిపారు. కాగా, రాష్ట్రపతి అవార్డు ప్రదానం చేయాలనుకున్న 11 మందిలో బెంగాలీ యాక్టర్ రిథీసేన్ ఒకరు.
అయితే కారణం బయటకు రాలేదు కానీ ఆయన ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారట. అవార్డులు సాధించిన ఓ విజేత.. రాష్ట్రపతి 11మందికి మాత్రమే అవార్డు ప్రదానం చేస్తారని ముందు రోజే స్పష్టం చేశారని ఓ న్యూస్ ఏజెన్సీతో పేర్కొన్నారు. మరి.. ఇంత వివాదం జరుగుతుంటే స్మృతీ ఇరానీ స్పందించలేదా? అంటే.. ‘‘అవార్డు ప్రదానం తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నవారి దగ్గరకు వచ్చి.. ఇది రాష్ట్రపతి కార్యాలయం తీసుకున్న నిర్ణయం కాబట్టి నేనేం చేయలేను’’ అని పేర్కొన్నారని ఓ ఫిల్మ్ మేకర్ అంటున్నారు. మన తెలుగు పరిశ్రమ నుంచి ‘బాహుబలి 2’కిగాను నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్ దేవినేని, ‘ఘాజీ’ చిత్రానికి పీవీపీ అవార్డులు అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment