‘బాహుబలి’పై ఐటీ దాడులు
హైదరాబాద్: బాహుబలి సినీ నిర్మాతలు, కార్యాలయాలపై శుక్రవారం మధ్యాహ్నం ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. రాత్రి పొద్దుపోయే వరకు తనిఖీలు కొనసాగాయి. ఆర్కా మీడియా పతాకంపై నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కార్యాలయం హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నం.2 ఉండగా, నిర్మాత శోభు యార్లగడ్డ నివాసం ఫిలింనగర్లో, మరో నిర్మాత ప్రసాద్ దేవినేని ఇల్లు జూబ్లీహిల్స్‌లో ఉంది. 25 మంది ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి ఈ మూడు చోట్ల ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఇందులో రూ.60 కోట్ల మేర రద్దయిన పాత నోట్లను గుర్తించినట్లు సమాచారం. అలాగే సినిమాకు సంబంధించిన రశీదులు, కీలక పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పన్ను చెల్లించకుండా ఎగ్గొడుతున్నట్లు ధృవీకరించే కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. వివరాలను ఆర్కా మీడియా కార్యాలయ మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు. గంటల తరబడి ఐటీ అధికారులు ఓ బడా సినిమాకు సంబంధించిన నిర్మాతలపై దాడులు నిర్వహించడం టాలీవుడ్‌ను కుదిపేసింది. ఈ వ్యవహారం నిర్మాతలు, దర్శకులు, హీరోల్లో చర్చనీయాంశం అయింది. ఇదిలా ఉండగా ఐటీ అధికారులు దాడులు చేస్తున్న సమయంలో శోభు యార్లగడ్డ ఇక్కడ లేనట్లు సమాచారం. ప్రసాద్ దేవినేని మాత్రం మధ్యాహ్నం వరకు నగరంలో ఉండగా ఐటీ అధికారుల దాడులు తెలుసుకొని ఆయన మకాం మార్చినట్లు తెలుస్తోంది.
కాగా ఎంత డబ్బును గుర్తించారు, ఏమేం పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అన్నదానిపై అధికారుల నుంచి స్పష్టత లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పట్టుబడిన డబ్బు రూ.60 కోట్లని పైకి తెలుస్తున్నా... ఇంకా భారీ మొత్తంలోనే దొరికినట్లు సమాచారం. పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ కార్యాలయంలో సంచుల కొద్ది డబ్బు ఉందని గుర్తు తెలియని వ్యక్తి ఐటీ అధికారులకు సమాచారం ఇవ్వడంతోనే వారు ఈ దాడులు చేసినట్లు సమాచారం.