నాలుగు వారాల్లో జయలలిత డిశ్చార్జ్!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరో మూడు లేదా నాలుగు వారాల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్ అయ్యే అవకాశం ఉందని అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ జయలలిత ఆరోగ్యం మెగురుపడుతోందని క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ)నుంచి రెండు,మూడురోజుల్లో రూమ్‌లోకి మార్చనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి బాగా కోలుకుంటున్నారని, తన చుట్టు ఏం జరుగుతుందో ఆమె గుర్తిస్తున్నారని ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు. తనకు ఏం కావాలో జయలలిత అడుగుతున్నారని ఆయన పేర్కొన్నారు.
కాగా జయలలిత ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడినట్లు అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి సి.పొన్నియన్ చెప్పారు. ఆమె ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అదుపులోకి వచ్చిందని, ఇప్పుడు క్లిష్ట పరిస్థితి నుంచి బయట పడటం, శ్వాసకోశ వ్యవస్థ కూడా బాగుపడటంతో ఆమెను గదిలోకి మారుస్తున్నారని ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే. అనారోగ్యానికి గురైన జయలలిత సెప్టెంబర్ 22 నుంచి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.