కత్తులు దూసిన నకిలీ విత్తులు
► నాసిరకం విత్తనాల బారిన పడి ఇద్దరు అన్నదాతల ఆత్మహత్య...
► మొక్క పెరిగినా పూత, పిందె రాక అన్నదాతల తీవ్ర ఆందోళన
► రాష్ట్రంలో ఇద్దరు మిర్చి రైతుల ఆత్మహత్య
► పంట రాక, అప్పులు తీర్చే మార్గం లేక బలవన్మరణం
► మొక్క పెరిగినా పూత, పిందె రాక రైతన్నల మనోవేదన.. అప్పులు తీర్చలేక బలవన్మరణం
► అధికార నేతలు, అనుచరులదే పాపం.. గతేడాది మిర్చికి మంచి ధర రావడంతో సాగుపై పెరిగిన ఆసక్తి
► రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి సొమ్ము చేసుకున్న నేతలు.. కృత్రిమ కొరతతో ధర పెంపు
► గుంటూరు జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి అనుచరుగణాలదే ‘నకిలీ’ విత్తనాల దందా!
► ప్రభుత్వ పెద్దలకు భారీగా ముడుపులు.. బాధ్యులపై చర్యలకు వెనుకాడుతున్న రాష్ర్ట సర్కారు
సాక్షి, హైదరాబాద్: నకిలీ మిరప విత్తనాలు కత్తులు దూస్తున్నాయి. రైతుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. మొక్క ఏపుగా పెరిగినా పూత, పిందె రాక అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. పంట చేతికి వచ్చే అవకాశం లేక, పెట్టుబడుల కోసం రూ.లక్షల్లో చేసిన అప్పులను తీర్చే మార్గం కనిపించక బలబన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా నకిలీ మిరప విత్తనాల కాటుకు ఇద్దరు యువ రైతులు బలైపోయారు.
మిర్చిని సాగుచేస్తున్న కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఈ ఏడాది మిర్చి పట్ల రైతులకున్న ఆసక్తిని పసిగట్టిన అధికార పార్టీ నేతలు, వారి అనుచరులు ముందుగానే రంగంలోకి దిగారు. రైతులకు నకిలీ విత్తనాలను అధిక ధరలకు అంటగట్టి జేబులు నింపుకున్నారు. నకిలీ విత్తనాల వల్ల రైతాంగం నష్టపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. బాధ్యులపై కఠినంగా వ్యవహరించాల్సింది పోయి తూతూమంత్రంగా అరెస్టులు చేసి చేతులు దులుపుకుంటోంది.
1,35,800 హెక్టార్లలో సాగు...
గతానికి భిన్నంగా ఈ ఏడాది రాష్ట్రంలో 1,35,800 హెక్టార్లలో మిర్చి సాగవుతోంది. గతేడాది మిర్చికి మంచి ధర రావడంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో సాగు విస్తీర్ణం పెరిగింది. ప్రకాశం, గుంటూరు జిల్లాల రైతులు ఎకరాకు రు.20 వేలు చెల్లించి, కౌలుకు తీసుకుని మరీ సాగు చేస్తున్నారు. విజయనగరంలో 196 హెక్టార్లు, విశాఖలో 205, తూర్పుగోదావరిలో 1,045, పశ్చిమ గోదావరిలో 208, కృష్ణాలో 16,132, గుంటూరులో 70,005, ప్రకాశంలో 21,432, కర్నూలులో 22,566, అనంతపురంలో 3,145, వైఎస్సార్ జిల్లాలో 864 హెక్టార్లలో మిర్చిని సాగు చేస్తున్నారు.
గతేడాది లాభాలను దృష్టిలో ఉంచుకుని రైతులు ఒక్కసారిగా మిర్చి వైపు మొగ్గు చూపడంతో అధికార పార్టీ ముఖ్య నేతల అనుచరుల దృష్టి ఈ వ్యాపారంపై పడింది. విత్తనాల విక్రయాలను పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. కృత్రిమ కొరత సృష్టించారు. ధరను అమాంతం పెంచేశారు. డిమాండ్ అధికంగా ఉండడంతో నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించారు. రూ.30 వేల ధర ఉన్న కిలో మిరప విత్తనాలను రూ.80 వేలకు విక్రయించారంటే అన్నదాతలను ఏ స్థాయిలో దోచుకున్నారో అర్థం చేసుకోవచ్చు.
మంత్రి ప్రత్తిపాటికి తెలిసే జరిగిందా?
నకిలీ మిరప విత్తనాల వ్యవహారం వెనుక సాక్షాత్తూ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హస్తం ఉండడం వల్లే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గుంటూరు జిల్లాలోని నకిలీ విత్తన కంపెనీల గుట్టుమట్లు మంత్రికి తెలుసని, ప్రముఖ విత్తన సంస్థల పేరిట నకిలీ విత్తనాలు సరఫరా చేసిన వారిలో మంత్రి అనుచరులు కూడా ఉన్నారని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. నకిలీ విత్తనాలమ్మిన ఓ కంపెనీ యజమాని మంత్రి ప్రత్తిపాటికి అత్యంత సన్నిహితుడని జిల్లాలో ప్రచారం సాగుతోంది. నకిలీ విత్తనాల బాగోతంలో ప్రభుత్వ పెద్దలకు భారీగా ముడుపులు ముట్టడం వల్లే బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విత్తన ధ్రువీకరణ సంస్థ ఏం చేస్తున్నట్లు?
విత్తనాల నాణ్యతను ధ్రువీకరించేందుకు రాష్ట్ర విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ సంస్థ ఉంది. ఇక్కడ ధ్రువీకరించిన విత్తనాలనే మార్కెట్లో విక్రయించాలి. అయినా విత్తనాల వ్యాపారుల ముసుగులో నేతల అనుచరులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. ఎలాంటి ధ్రువీకరణ, అనుమతులు లేకుండానే మిరప విత్తనాలను రైతులకు అంటగట్టారు.
రూ.30 వేల పరిహారం ఇప్పించాలి
గుంటూరు జిల్లా కోటప్పకొండ ప్రాంతంలో గతంలో నకిలీ విత్తనాల వల్ల రైతులు పంట నష్టపోయినప్పుడు అదే జిల్లాకే చెందిన తులసీ సీడ్స్ నుంచి ఎకరాకు రూ.20 వేల వరకు అప్పటి ప్రభుత్వం పరిహారం ఇప్పించింది. ఇప్పుడా మొత్తాన్ని రూ.30 వేలకు పెంచి రైతులకు ఇప్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పంట నష్టపోయిన ప్రతి రైతుకూ ప్రత్యామ్నాయ పంట వేసుకునేందుకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని కోరుతున్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని సూచిస్తున్నాయి.
నకిలీ విత్తనాలు అమ్మితే జైల్లో పెట్టాలి
రాష్ట్రంలో విత్తనాలు, ఎరువులను కల్తీ చేస్తున్నా అడిగే నాథుడే లేకుండా పోయాడని రైతు స్వరాజ్య వేదిక కన్వీనర్ విస్సా కిరణ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలపై నియంత్రణ ఉండాలని, నకిలీ విత్తనాలు అమ్మేవారికి భారీగా జరిమానాలు విధించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతిపాదిత విత్తన చట్టంలో పేర్కొన్న ప్రకారం బాధిత రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని, సంబంధిత నకిలీ కంపెనీ నిర్వాహకులను జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు.
ఇద్దరు మిర్చి రైతుల ఆత్మహత్య
నకిలీ విత్తనాల బారినపడ్డ ఇద్దరు యువ రైతులు ఇటీవల కన్నుమూశారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం ఎలవర్తిపాడుకు చెందిన ఎర్రసాని విజయ్ మిరప తోటలోనే పురుగు మందు తాగి చనిపోయాడు. కర్నూలు జిల్లా ప్యాపిలిలో రాయుడు అనే మిర్చి రైతు కూడా క్రిమిసంహారక మందు తాగి తనువు చాలించాడు.