పీఆర్సీల అమలు ఆలస్యంతో ఉద్యోగులకు తీవ్ర నష్టం
హైపవర్ కమిటీకి విన్నవించిన ఉద్యోగ జేఏసీ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో 9 పీఆర్సీల అమలులో జరిగిన జాప్యం వల్ల ఉద్యోగులు 12 ఏళ్ల కాలపు ప్రయోజనాలను నష్టపోయారని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ పేర్కొంది. ఆ నష్టాన్ని పూడ్చేందుకు చర్యలు చేపట్టాలని పీఆర్సీపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీకి విజ్ఞప్తి చేసింది. జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్, టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, టీఎన్జీవోస్, టీజీవో ప్రధాన కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ, ఉపాధ్యాయ సంఘాల నేతలు రాజిరెడ్డి, మల్లారెడ్డి, టీఎస్టీయూనేతలు ఆడమ్స్, రహమాన్ బుధవారం సచివాలయంలో హైపవర్ కమిటీ చైర్మన్ ప్రదీప్‌చంద్రను కలిశారు.
ఏపీ ఏర్పడినప్పుడు తెలంగాణలోని ఉద్యోగులకు అన్యాయం జరిగిందని, ఆ సమయంలో ఇచ్చిన మొదటి పీఆర్సీలో... అంతకుముందు తెలంగాణ ఉద్యోగులకున్న వేతనాలను తగ్గించి ఆంధ్రా ఉద్యోగులతో సమానం చేశారన్నారు. ప్రస్తుత పీఆర్సీ అమలులో ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని ప్రదీప్‌చంద్రకు వివరించారు. పీఆర్సీ అమలుపై జేఏసీ మంగళవారం నిర్వహించిన సమావేశపు తీర్మానాలను ప్రదీప్‌చంద్రకు అందజేశామని, వాటిపై ఆయన సానుకూలంగా స్పందించారని జేఏసీ నేతలు తెలిపారు.