రాజీవ్ విద్యా ‘వేదన’
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్ : పాఠశాలల్లో 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ విద్యార్థులు పుస్తకాలు కొనుగోలు చేసేందుకు, ఇతర అవసరాల నిమిత్తం ప్రీమెట్రిక్ స్కాలర్షిప్లు అందించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న రాజీవ్ విద్యా దీవెన పథకం జిల్లాలోని విద్యార్థులకు వేదన మిగిలిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం మరో నెలరోజుల్లో ముగియనున్నప్పటికీ నేటికీ దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తికాకపోవడంతో విద్యార్థులకు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్లు కలగానే మిగిలాయి. కఠిన నిబంధనలతో పాటు అధికారుల నిర్లక్ష్యమే అందుకు కారణంగా తెలుస్తోంది.
రాజీవ్ విద్యా దీవెన పథకాన్ని 2012లో రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. మొదట ఎయిడెడ్, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు (డే స్కాలర్స్‌కు) మాత్రమే ఈ పథకాన్ని అమలుచేసింది. ఈ పథకం కింద నోట్ పుస్తకాల కొనుగోలు, ఇతర అవసరాల కోసం విద్యార్థులకు నెలకు 150 రూపాయల చొప్పున 10 నెలల పాటు 1,500 రూపాయలతో పాటు అడ్‌హాక్‌గా 750 రూపాయలు కలిపి ఏడాదికి మొత్తం 2,250 రూపాయలు అందిస్తారు.
కాగా, ఈ ఏడాది నుంచి 5, 6, 7, 8 తరగతుల విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరగతులు చదువుతున్న బాలికలకు నెలకు 150 రూపాయల చొప్పున 10 నెలలకు 1,500 రూపాయలు, బాలురకు నెలకు 100 రూపాయల చొప్పున 10 నెలలకు 1,000 రూపాయలు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పథకం లక్ష్యం ఘనంగానే ఉన్నప్పటికీ ఆచరణ మాత్రం శూన్యంగా ఉంది.
శాపంగా మారిన నిబంధనలు...
రాజీవ్ విద్యా దీవెన పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అనేక నిబంధనలు విధించడం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్‌కార్డు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా తప్పనిసరి. అయితే, పాఠశాల స్థాయి విద్యార్థులకు జీరో బ్యాలెన్స్ఖాతాలు తెరిచేందుకు బ్యాంకర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నారు. దీనికితోడు రెవెన్యూ అధికారులు సకాలంలో ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇవన్నీ ఒకెత్తయితే ఆధార్‌కార్డు నిబంధన విద్యార్థులను వేధిస్తోంది.
ఆధార్ కార్డు కోసం వివరాలు నమోదు చేయించుకున్నప్పటికీ కార్డులు రాకపోవడంతో అర్హులైన ఎంతోమంది విద్యార్థులు రాజీవ్ విద్యా దీవెన పథకానికి దూరమవుతున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తికాకపోవడంతో తమకు రాజీవ్ విద్యా దీవెన స్కాలర్షిప్లు అందుతాయో..లేదోనని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల పరీక్షలపై దృష్టి సారించలేకపోతున్నారు.
అధికారుల అలసత్వం వల్లే అవస్థలు...
రాజీవ్ విద్యా దీవెన పథకం అమలులో జిల్లా అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులను అవస్థలకు గురిచేస్తోంది. ఈ పథకంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పథకంపై సంబంధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ఉంటే అవసరమైన పత్రాలను వారు సిద్ధం చేసుకుని పథకానికి సకాలంలో దరఖాస్తు చేసుకునేవారు.
కానీ, అధికారులు సగం విద్యాసంవత్సరం పూర్తయిన తర్వాత పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు తక్కువ సమయం ఉందనగా హడావిడి చేయడంతో అంతా గందరగోళం నెలకొంది. అర్హులైన విద్యార్థులంతా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేకుండా పోతోంది. పథకం లక్ష్యం నీరుగారిపోతోంది. స్కాలర్‌షిప్‌తో విద్యార్థులు పుస్తకాలు కొనుగోలు చేయకుండానే విద్యా సంవత్సరం ముగుస్తోంది. ప్రభుత్వం, అధికారులు వెంటనే ఈ పథకంపై దృష్టిసాంచి యుద్ధప్రాతిపదికన అవసరమైన చర్యలు తీసుకుంటేతప్ప అర్హులైన విద్యార్థులందరికీ న్యాయం జరిగే అవకాశం లేదు.