విద్యార్థిగా మారిన డీజీపీ!
ఎస్కేయూలో ప్రీ పీహెచ్డీ పరీక్షకు హాజరు
రాష్ట్ర పోలీసుశాఖలో అత్యున్నత పదవిలో ఉన్న డీజీపీ బయ్యారపు ప్రసాదరావు విద్యార్థిగా మారారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(ఎస్కేయూ)లో భౌతికశాస్త్రంలో పరిశోధన చేసేందుకు ప్రభుత్వ అనుమతితో ఎగ్జిక్యూటివ్ కోటా కింద పీహెచ్‌డీలో పేరు నమోదు చేసుకున్న ప్రసాదరావు.. ఇందులో భాగంగా పీహెచ్‌డీకి అర్హత పొందేందుకు అవసరమైన ప్రీ పీహెచ్డీ పేపర్-1 (రీసెర్చ్ మెథడాలజీ) పరీక్షను శనివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాశారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్-2 (లైట్ అండ్ మ్యాటర్ ఇంటరాక్షన్) పరీక్ష రాయనున్నారు.
డీజీపీకి సమైక్య సెగ :ఎస్కేయూలో ప్రీ పీహెచ్డీ పరీక్ష రాసి వెళుతున్న డీజీపీని విద్యార్థి జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఉద్యమించిన విద్యార్థులపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. డీజీపీ స్పందిస్తూ.. కేసుల ఎత్తివేత వ్యవహారం తన పరిధిలో లేదని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.