అంగన్వాడీకి హంగులు
► ప్రీ స్కూల్ పిల్లల కోసం కొత్త ఆట వస్తువులు ఇప్పటికే టీచర్లకు పంపిణీ
► ప్రైపెవేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దేందుకు యత్నాలు
హన్మకొండ అర్బన్ : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య నేర్పడంలో కీలకపాత్ర పోషించే అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇంతకాలం డ్రాయింగ్ షీట్లపై స్కెచ్‌లతో గీసిన బొమ్మలు, పాత కాలం నాటి చార్టలపై ఉన్న బొమ్మలతో చిన్నారులకు అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన కల్పిస్తున్న విషయం విదితమే. అయితే, ప్రైవేట్ ప్రీ ప్రైమరీ స్కూళ్లకు దీటుగా అంగన్ వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతన పరికరాలను అందజేస్తోంది. తాజాగా అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం నుంచి వచ్చిన చార్‌టలు, బొమ్మలను అధికారులు అందజేశారు.
కేజీ టూ పీజీలో భాగంగా..
రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న కేజీ టూ పీజీ విద్య కార్యక్రమంలో కూడా అంగన్వాడీ కార్యకర్తలను భాగస్వాములను చేయాలని డిమాండ్ ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూలత వస్తోంది. అలాగే, తమ సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనపై ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తుండగా.. అంగన్ వాడీ కార్యకర్తలు కూడా పనితీరులో ప్రతిభ చూపాలని భావిస్తున్నారు. ప్రస్తుతం వేసవిలో కూడా అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతుండగా.. వన్డే పుల్‌మీల్స్ పేరుతో పిల్లలు, తల్లులు, గర్భిణులకు సంపూర్ణ పౌష్టికాహారం అందజేస్తున్న విషయం విదితమే. ఇక అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రైవేట్ ప్రీ ప్రైమరీ స్కూళ్ల మాదిరిగా ఆటపాటల ద్వారా చదువుకు శ్రీకారం చుట్టే విషయంలో వినూత్న మార్పులు తీసుకొస్తున్నారు.
ఆకట్టుకునే బొమ్మలు
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు తాజాగా కొత్త ఆట బొమ్మలు సరఫరా చేశారు. ఇంతకాలం ఈ విధమైన ఆట వస్తువుల్లో చాలావరకు ప్రైవేటు సెక్టార్‌లోని ప్లేవే స్కూళ్లు, ప్రీ స్కూళ్లలో మాత్రమే అందుబాటులో ఉండేవి. అంగన్వాడీ కేంద్రాలకు గతంలో కూడా సరఫరా చేసినా అవి నాసిరకమైనవే కావడంతో రంగులు వెలిసిపోగా.. పిల్లలకు బోధించడంలో కార్యకర్తలు ఇబ్బంది పడేవారు. ప్రసుత్తం అందజేస్తున్న చార్టులు, బొమ్మలు, రంగు పెన్సిళ్లు, ఫజిల్స్, పెయింటింగ్ బుక్స్ వంటి వాటితో పిల్లలు కేంద్రాలకు వచ్చేందుకు ఆసక్తి చూపుతారని భావిస్తున్నారు. అలాగే, బోధన కూడా కార్యకర్తలకు సులువు కానుంది.