షిర్డీ హుండీలో రూ. 92 లక్షల వజ్రాలు!
ఆలయాల్లో దేవుడికి నగలు, నగదు భారీ మొత్తంలో సమర్పించుకునే భక్తులను చూశాం. కానీ, షిర్డీలోని సాయిబాబా ఆలయ హుండీలో భారీ మొత్తంలో బంగారం, వెండితో పాటు అత్యంత విలువైన వజ్రాలు కూడా కనిపించాయి. ఎవరో అజ్ఞాత భక్తులు రెండు వజ్రాల నెక్లెస్‌లను హుండీలో వేశారు. వాటి విలువ దాదాపు రూ. 92 లక్షలు ఉంటుందని నగల వ్యాపారులు చెప్పారు. షిర్డీ ఆలయ చరిత్రలోనే హుండీలో ఇంత పెద్దమొత్తంలో విరాళాలు రావడం ఇదే మొదటిసారి. సాధారణంగా పెద్దమొత్తంలో విరాళాలు ఇచ్చేవారు నేరుగా ట్రస్టీలకు అందజేస్తారు.
హుండీలలో ఎప్పుడూ వివిధ దేశాలకు చెందిన నాణేలు, నగదు, బంగారు, వెండి ఆభరణాల లాంటివి కనిపిస్తూ ఉంటాయి. గత ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు భక్తులు 223 వజ్రాలను, ముత్యాలను, పగడాలను సాయిబాబాకు సమర్పించారని, వాటన్నింటి విలువ కలిపి రూ. 1.06 కోట్లు ఉంటుందని, కానీ ఈ రెండు వజ్రాల నెక్లెస్‌ల విలువ మాత్రం రూ. 92 లక్షలు ఉందని ఆలయ అకౌంట్ విభాగం అధిపతి దిలీప్ జిర్పే చెప్పారు. ఏప్రిల్ 21న హుండీలు తెరిచినప్పుడు ఈ నెక్లెస్‌లు బయటపడ్డాయి. వీటిలో ఒకటి 6.67 క్యారెట్లు, మరోటి 2.5 క్యారెట్లు ఉంటుందని, ఇందులోని వజ్రాలు చాలా విలువైనవని ముంబైకి చెందిన వజ్రాల నిపుణుడు నరేష్ మెహతా చెప్పారు.