తెలుగులోనే సివిల్స్
విజయనగరం ఫూల్‌బాగ్ : సివిల్స్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలను తెలుగులోనే నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఎంపీలు ఒత్తిడి తేవాలని రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. శనివా రం స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్ఐ)ఆధ్వర్యంలోతెలుగులో సివిల్స్ నిర్వహించడంతో పాటు సీశాట్ రద్దు చేయాలని కోరుతూ పలు ప్రజాసంఘాలు, మేధావులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీవైఎఫ్ఐరాష్ట్ర కార్యదర్శి ఎం. సూర్యారావు మాట్లాడుతూ, ప్రస్తుత సివిల్స్ పరీక్షా విధానం వల్ల సామాజిక శాస్త్రాల అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.
సీ శాట్‌ను రద్దుచేయడంతో పాటు ప్రాంతీయ భాషల్లో సివిల్స్ నిర్వహించాలని దేశవ్యాప్తంగా ఇప్పటికే నిరసనలు వెల్లువెత్తుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ విషయమై ప్రస్తుతం పార్లమెంట్లో చర్చ జరుగుతోందని, ఇప్పటికైనా తెలుగు ఎంపీలంతా ఏకమై ప్రాంతీయభాషల్లో సివిల్స్ నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. రిటైర్డ్ ఆర్డీఓ కె.ఆర్.డి.ప్రసాద్ మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సివిల్స్ పరీక్షా విధానంలో మార్పులు అవసరమేనని అభిప్రాయపడ్డారు. పంచాయతీరాజ్ ఏఈఈ ప్రభాత్ మాట్లాడుతూ, 2011 నుంచి అమల్లోకి వచ్చిన సీ శాట్ వల్ల నష్టాలెక్కువన్నారు. ప్రస్తుతమున్న సివిల్స్ విధానం కేవలం ధనవంతులకు మాత్రమే ఉపయోగపడేదిగా, కార్పొరేట్రంగానికి లాభాలను తెచ్చేదిగా ఉందని అభిప్రాయపడ్డారు.
అంతకుముందు డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ ఎ.జగన్మోహన్రావు ప్రవేశపెట్టిన ‘సివిల్స్ తెలుగులో నిర్వహిం చాలి, సీ శాట్‌ను రద్దుచేయాలి’తీర్మానాన్ని రౌండ్‌టేబుల్ సమావేశం ఆమోదించింది. కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఆర్ఓ డి.రామ్‌కుమార్, ఏపీ ఎన్జీఓ జిల్లా కార్యదర్శి ఆర్వీ రమణమూర్తి, అసోసియేట్ అధ్యక్షుడు కె.రామకృష్ణరాజు, బీసీ హాస్టల్స్ వెల్ఫేర్స్ వార్డెన్స్ మాజీ రాష్ట్ర కార్యదర్శి ఎస్.గౌరీప్రసాద్, డీవైఎఫ్ఐ నాయకులు కె.త్రినాథ్, ఆర్.త్రినాథ్, పి.శ్రీరామ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.గణేష్, మణికంఠ పాల్గొన్నారు.