వడగండ్లు, గాలివాన బీభత్సం
నేరడిగొండ, న్యూస్‌లైన్ : మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కురిసిన ఈదురుగాలులతో కూడిన అకాల వడగండ్ల వర్షంతో ఇండ్ల పైకప్పులు లేచిపోయి అల్లంత దూరంలో పడ్డాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగి పడ్డాయి. బుగ్గారం, చిన్నబుగ్గారం, నేరడిగొండ, బంధం, దూదిగండి, గుత్పాల, సావర్గాం, కిష్టాపూర్, సావర్గాం, కుంటాల తదితర గ్రామాల్లో వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన వర్షంతో ప్రజలు భయపడ్డారు. కాగా కొందరి ఇండ్ల పైకప్పులు, రేకులు ఈదురు గాలులకు లేచి గ్రామ శివారులో పడ్డాయి.
సావర్గాం గ్రామంలో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ తీగలన్నీ గ్రామంలో పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కాగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కూరగాయల పంటలు, మామిడి రైతులకు వడగండ్ల వర్షం పెను నష్టం కలిగించింది. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలుకు సంబంధించి పైకప్పు రేకులు ఈదురు గాలులకు లేచిపోయాయి. రెండు గంటల పాటు కురిసిన వర్షం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. వడగండ్ల వర్షంతో ఎంత నష్టం వాటిల్లిందనేది పూర్తిస్థాయిలో తెలియరాలేదు.