మార్కెట్లోకి హ్యుందాయ్ ‘ఎలైట్ ఐ 20’
సాక్షి, న్యూఢిల్లీ: హ్యుందాయ్ కంపెనీ ఐ20 మోడల్లో అంతా కొత్తదైన ఎలైట్ ఐ20 కారును సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. పెట్రోల్, డీజిల్ వేరి యంట్లలో ఈ కారును అందిస్తున్నామని హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఎండీ, బీఎస్ సియో చెప్పారు. పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.4.9 లక్షలు నుంచి రూ.6.46 లక్షల రేంజ్లో, డీజిల్ వేరియంట్ ధరలు రూ.6.09 లక్షల నుంచి రూ.7.67 లక్షల రేంజ్లో (ధరలు ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయని వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ కారును మొదటిసారి భారత్‌లోనే విడుదల చేశామని చెప్పారు. ఐ20 మోడల్‌ను 2008, డిసెం బర్లో మార్కెట్లోకి తెచ్చామని ఇప్పటిదాకా 7.34 లక్షలు విక్రయించామని పేర్కొన్నారు. ఈ కొత్త మోడల్లో ఎరా, మాగ్నా, స్పోట్జ్, స్పోట్జ్ (ఓ), ఆస్టా-5 వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు మారుతీ సుజుకి స్విఫ్ట్, ఫోక్స్‌వ్యాగన్ పోలో కార్లకు గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి.
నెలకు 6000కు ఐ20 అమ్మకాలు
గత ఏడాది మొత్తం 3.8 లక్షల కార్లను విక్రయించామని, ఈ ఏడాది 4.10 లక్షల కార్లను విక్రయించాలనేది లక్ష్యమని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ఐ20 కార్లు నెలకు 3,800 చొప్పున అమ్ముడవుతున్నాయని, ఈ కొత్త వెర్షన్‌తో ఈ సంఖ్య 6,000కు చేరగలదని చెప్పారు.