ఫైనాన్షియల్ బేసిక్స్.. రైడర్ల అవసరమేంటి?
జీవిత బీమా పాలసీ ప్రయోజనాలను విస్తృతం చేసుకోవడానికి, దాన్ని మన అవసరాలకు తగినట్లు మార్చుకోవడానికి రైడర్లు ఉపయోగపడతాయి. రైడర్ల సాయంతో అదనపు జీవిత బీమా కవరేజ్ పొందొచ్చు. జీవిత బీమా పాలసీలకు రైడర్లను జత చేసుకుంటే వారు ఆర్థికంగా మరింత రక్షణ పొందే అవకాశం ఉంది. టర్మ్ పాలసీతో పోలిస్తే రైడర్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో అనారోగ్య సంబంధిత రైడర్లు, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్లు, డిజేబిలిటీ రైడర్లు, టర్మ్ రైడర్లు, ప్రీమియం రైడర్లు వంటి పలు రకాల రైడర్లు అందుబాటులో ఉన్నాయి.
రైడర్ల ఎంపికలో మన అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. టర్మ్ ప్లాన్, ఎండోమెంట్ ప్లాన్, యులిప్స్, మనీ బ్యాక్ ప్లాన్ వంటి ఏ ప్లాన్‌కు చెందిన పాలసీదారులైనా వారి పాలసీలకు రైడర్లను జత చేసుకోవచ్చు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పర్యావరణ మార్పులు, కాలుష్యం వంటి అంశాల కారణంగా కొత్త కొత్త వ్యాధులొస్తున్న తరుణంలో బేసిక్ బీమా పాలసీలకు అదనంగా రైడర్లను తీసుకోవడం మంచిది.