ప్రీమియం పన్ను రద్దు
సాక్షి, ముంబై: ప్రతిపాదిత నవీముంబై విమానాశ్రయం ప్రాజెక్టు బాధితులకు అందజేసే స్థలంపై ‘ప్రీమియం పన్ను’ మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన ప్రతి పాదనపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆమోద ముద్రవేశారు. దీంతో ఇక్కడి నివాసులకు, రైతులకు, వ్యాపార, వాణిజ్య సంస్థలకు కొంతమేర ఊర ట లభించినట్లయింది. నవీముంబైలో ప్రతిపాదిత విమానాశ్రయం నిర్మాణం కోసం అనేక మంది తమ స్థలాలు కోల్పోయారు. కొన్ని గ్రామాలను ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఇలాంటి బాధితులకు నష్ట పరిహారంతోపాటు 22.5 శాతం ప్రత్యామ్నాయ భూములు ప్రభుత్వం అందజేయనుంది.
అయితే ఈ భూములకు ‘లీజు ప్రీమియం పన్ను’ సిడ్కోకు చెల్లించాల్సి ఉంటుంది. కాని ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది. నవీముంబైలో ఉన్న స్థలాలన్నీ సిటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (సిడ్కో) ఆధీనంలో ఉన్నాయి. ఈ స్థలాలను నివాసులకు, పరిశ్రమలకు, ఇతర ప్రయోజనాలకు 60 ఏళ్ల కోసం లీజుకు ఇచ్చింది. అందుకు సిడ్కో వీరి నుంచి లీజు ప్రీమియం వసూలు చేస్తోంది. ఇప్పుడు ప్రతిపాదిత విమానాశ్రయం ప్రాజెక్టు కోసం స్థలా లు కోల్పోయిన బాధితులకు పునరావాసం కోసం అందజేస్తున్న 22.5 శాతం భూమిపై లీజు ప్రీమి యం తీసుకోకూడదని సిడ్కో నిర్ణయం తీసుకుంది.
విమానాశ్రయం నిర్మాణం కోసం 2,268 హెక్టార్ల భూమి అవసరముండగా సిడ్కో ఆధీనంలో 1,572 హెక్టార్ల స్థలం ఉంది. అదనంగా 671 హెక్టార్ల స్థలం సేకరించాల్సి అవసరం ఏర్పడింది. సుమారు పది గ్రామాలను ఖాళీ చేయించాల్సి వచ్చింది. అందుకు బాధితులకు పుష్పనగర్ ప్రాంతంలో 22.5 శాతం స్థలాన్ని అందజేయనున్నారు. ఈ స్థలానికి ఎలాంటి లీజు ప్రీమియం పన్ను వసూలు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించడంతో సిడ్కో సుమారు రూ.70 కోట్లు ఆదాయం కోల్పోయినట్లే. గతంలో ఈ విమానాశ్రయాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు ఆం దోళనలు నిర్వహించారు.
ప్రభుత్వం చెల్లించే నష్ట పరిహారం, వివిధ ప్యాకేజీలు నచ్చకపోవడంతో ఈ ప్రాజెక్టు కొద్ది నెలలు అటకెక్కింది. చివరకు రాజ కీయ నాయకులు, స్థానిక ప్రతినిధులు జోక్యం చేసుకోవడంతో సమస్య పరిష్కారమైంది. బాధితుల డిమాండ్ ప్రకారం ప్రత్యామ్నాయ స్థలం అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే లీజు ప్రీమియం పన్ను విషయం తెరమీదకు వచ్చింది. దీనిపై ఎటూ తేలకపోవడంతో మళ్లీ సమస్య మొదటికే వచ్చింది. ఎట్టకేలకు లీజు ప్రీమియం పన్ను కూడా మాఫీ చేసేందుకు ప్రభుత్వం ముందుకురావడంతో ఓ పెద్ద సమస్య పరిష్కారమైందని ప్రజలు, అధికారులు భావిస్తున్నారు.