Present Tense
-
మంచి మాట: వర్తమానమే జీవితం
మనిషి బతకాల్సింది గతంలోనో, భవిష్యత్తులోనో కాదు వర్తమానంలో. కానీ శోచనీయంగా చాలమంది గతంలోనో, భవిష్యత్తులోనో బతుకుతూ ఉంటారు. గతంలో జరిగిన వాటిని తలుచుకుంటూ వర్తమానాన్ని గడిపేస్తూ ఉంటారు. భవిష్యత్తులో ఇవి చేద్దాం, అవి చేద్దాం అనుకుంటూ వర్తమానాన్ని జారవిడుచుకుంటూ ఉంటారు. ఈ తీరు పెనుతప్పు మాత్రమే కాదు, బతుకును గుట్టుగా కాల్చేసే కనిపించని నిప్పు కూడా. ‘మనలో చాలమంది వర్తమానంలో పూర్తిగా ఉండరు. ఎందుకంటే తమకు తెలియకుండానే వాళ్లు ఈ క్షణం కన్నా తరువాతి క్షణం ముఖ్యమైందని నమ్ముతారు. అలా ఉంటే నువ్వు నీ పూర్తి జీవితాన్ని కోల్పోతావు...’ అని జర్మన్ తాత్విక అధ్యాపకుడు ఎక్‌హార్ట్ టోల్ చెబుతారు. ఒక మనిషి వర్తమానం లో బతకక పోవడం అనే మానసిక దోషానికి విశ్వాసం అనేది లేకపోవడం ప్రధాన కారణం. ఏ వ్యక్తికైనా కాలం మీద, ప్రయత్నాల మీద విశ్వాసం ఉండాలి. అష్టావక్రగీత ఒక సందర్భంలో విశ్వాసాన్ని అమృతం అంటూ‘విశ్వాసామృతాన్ని తాగి సుఖివిగా ఉండు’ అని మనిషికి ముఖ్యమైన సూచనను ఇచ్చింది. సుఖంగా ఉండాలంటే మనిషికి విశ్వాసం అనేది ఉండాలి; ముఖ్యంగా ఆత్మవిశ్వాసం ఉండాలి.‘నిన్ను నువ్వు విశ్వసించడం విజయంలోని తొలి రహస్యం‘ అని గౌతమ బుద్ధుడు తెలియజెప్పాడు. దట్టమైన చీకటిలో ఎగిరే లేదా ఎగరగలిగే పక్షికి ఆత్మవిశ్వాసం ఉంటుంది. తనకు ఆత్మవిశ్వాసం ఉంది అనే భావన పక్షికి ఉండకపోవచ్చు. అంతేకాదు, చీకట్లో ఎగిరే పక్షికి గతం గురించి, భవిష్యత్తు గురించి తలపు లు ఉండవు. వర్తమానంలో పక్షి ఎగురుతోంది; వర్తమానంలో ఎంత చీకటి ఉన్నా అంత చీకటిలోనూ పక్షి ఎగర గలుగుతుంది. ఎందుకంటే పక్షి వర్తమానంలో బతుకుతూ ఉంటుంది. పక్షి మనిషికి ఆదర్శం కావాలి. ‘మనిషి బాధపడడం సుఖం అనుకుంటున్నాడు, సుఖపడడానికి బాధపడుతున్నాడు’ కాబట్టే వర్తమానంలో ఉండీ గతంలోకో, భవిష్యత్తులోకో దొర్లిపోతూ ఉంటాడు. మనిషి ఈ స్థితికి బలి అయిపోకూడదు. మనిషి ఈ స్థితిని జయించాలి.‘గతంలోని శోకంతో పనిలేదు; భవిష్యత్తు గురించి చింతన చెయ్యక్కర్లేదు; వర్తమానంలోని పనుల్లో నిమగ్నం అవుతారు వివేకం ఉన్నవాళ్లు’ అని విక్రమార్క చరిత్ర చక్కగా చెప్పింది. గతంలో సంతోషం ఉండి ఉన్నా, శోకం ఉండి ఉన్నా అవి ఇప్పటివి కావు కాబట్టి గతాన్ని తలుచుకుంటూ ఉండిపోతే మన వర్తమానం వృథా అయిపోతుంది. వర్తమానం వృథా అయిపోతే భవిష్యత్తు కూడా వృథా అయిపోతుంది. గతం గడిచిపోయింది కాబట్టి, వర్తమానం వచ్చేసింది కాబట్టి వర్తమానంలో ఉన్న మనిషి గతంలోనో, భవిష్యత్తులోనో కాకుండా వర్తమానంలోనే ఉండాలి. ‘నీ హృదయం ఒక సముద్రం అంతటిది. వెళ్లి నిన్ను నువ్వు కనుక్కో మరుగున ఉన్న దాని లోతుల్లో’ అని ఫార్సీ తాత్విక కవి రూమీ చెప్పారు. గతంలో భవిష్యత్తు ఉండదు. భవిష్యత్తు గతంలా ఉండకూడదు. మనిషి వర్తమానంలో బతకడం నేర్చుకోవాలి. వర్తమానంలో బతకడం నేర్చుకున్న మనిషి భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది. ఉన్నతమైన భవిష్యత్తు కోసం, ఉన్నతమైన జీవితం కోసం మనుషులమైన మనం వివేకంతో వర్తమానంలో నిమగ్నమవ్వాలి. వర్తమానంలో ఉన్న మనిషి తన హృదయపు లోతుల్లోకి వెళ్లి తనను తాను కనుక్కోవాలి. అలా తనను తాను కనుక్కోవాలంటే మనిషి గతంలోనో, భవిష్యత్తులోనో పడిపోతూ ఉండకూడదు. మనిషి వర్తమానంలో మసలాలి; మనిషి వర్తమానంతో మెలగాలి. హృదయపు లోతుల్లోకి వెళ్లి తనను తాను కనుక్కోగలిగిన వ్యక్తి మానసిక దోషాలకు అతీతంగా వర్తమానంలో వసిస్తాడు. – శ్రీకాంత్ జయంతి -
మంచి మాట: వర్తమాన జీవితం
చాలామంది భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అని చింతిస్తూ, దాని బాగుకోసం అనేక రకాలుగా మానసికంగా చింతిస్తూ ఉంటారు. మరి కొంతమంది గతంలో తాము చేసిన తప్పిదాల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ, తమ చుట్టూ ఉన్నవారిని కూడా బాధ పెడుతూ ఉంటారు. ఈ రెండు అవస్థల మధ్య వారు వర్తమానంలో బతకలేరు. పైగా వర్తమానంలో బతకడం అదేదో గొప్ప నేరంగా భావించి దాని జోలికి వెళ్ళనుగాక వెళ్ళరు. గతం గురించి ఆలోచించడం అవసరమే. అలాగే, భవిష్యత్తు గురించి ఆలోచించడం కూడా అవసరమే. అయితే ఇలా గతం, భవిష్యత్తుల కోసం ఆలోచిస్తూ, వర్తమానాన్ని పట్టించుకోకపోతే జీవితం వృథా అయిపోతుంది. ఒక వ్యక్తి జీవన సరళి అతను చూసే దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. ఆ క్రమంలో వర్తమాన పరిస్థితుల మీద దృష్టి కేంద్రీకరిస్తే చాలా వరకు సమస్యల నుంచి తప్పించుకున్న వాడవుతారు. నిశ్శబ్దాన్ని వినగలగాలి. సూర్యోదయాన్ని ప్రేమించగలగాలి. సూర్యాస్తమయాన్ని ఆస్వాదించగలగాలి. అన్నింటికన్నా ముఖ్యమైంది – ఈ క్షణాన్ని జారిపోకుండా చూసుకోగలగాలి. ఈ విషయాలపై అవగాహన రానంత సేపూ సంతోషం అంటే ఏమిటో తెలియకుండా పోతుంది. మరోవైపు సంతోషం గురించి తెలియడానికి చాలా కాలం పడుతుంది. ఫలితంగా జీవించడం తెలియకుండా పోతుంది. జీవించడం తెలియకపోతే అసలు ఈ బతుకుకే అర్థం లేకుండా పోతుంది. కనుక జీవితంలో సంతోషంగా ఉండాలంటే వర్తమానంలో బతకాలి. వర్తమానంలో నివసించాలి. గతం భవిష్యత్తూ ముఖ్యమైనవే. అయితే వర్తమానం అంతకన్నా ముఖ్యమైనది. వర్తమానంలో జీవించడం అవసరం అంటే వర్తమానంలో మాత్రమే జీవించమని కాదు. గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. భవిష్యత్తు గురించి ప్రణాళికలు రచించాలి. వర్తమానంలో జీవించాలి. ఒక పశువు తనకు తిండి దొరికేవరకూ వెతుకుతుంది. దొరకగానే తినడం మొదలు పెడుతుంది. అంటే రోజు మొత్తంలో కొంతసేపైనా వర్తమానంలో బతుకుతోందన్నమాట. అలాగే ఒక పిల్లి .. స్వేచ్ఛగా తిరుగుతుంటుంది. ఆకలేస్తే.. ఎలుకను నోటకరచుకుని తిని ఏ నీడ పట్టునో సేదదీరుతుంది. అదీ వర్తమానంలో జీవిస్తోంది. ఇలా పశువులు, పక్షులు, జంతువులు తోటిపశువులతో, తోటిపక్షులతో కలిసి ఆనందంగా రాగద్వేషాలకతీతంగా జీవిస్తున్నాయి. వర్తమానానికి విలువనిస్తున్నాయి. కానీ.. లౌకిక జ్ఞానం ఉన్న మనిషి మాత్రం వర్తమానంలో జీవించలేక పోతున్నాడు. పశు పక్ష్యాదులకు మనసు, బుద్ధి, ధర్మం వంటివి లేవు. అయినప్పటికీ అవి వర్తమానంలోనే జీవిస్తూ వర్తమానంలోనే ఆనందాన్ని వెదుక్కుంటున్నాయి. అయితే మనిషి మాత్రం తన కోసం జీవించలేకపోతున్నాడు. భవిష్యత్తు కోసం అతివిలువైన వర్తమానాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో భవిష్యత్ గురించి ఆలోచిస్తూ, తాను బతకడం లేదు సరికదా తన తోటివారిని కూడా బతకనివ్వడం లేదు. ఫలితంగా రేపటి కోసం ఆలోచిస్తూ, రేపటి భవిష్యత్ కోసమే దాచుకుంటూ, వర్తమానంలోని ఆనందాన్ని తనకు తానే నాశనం చేసుకుంటున్నాడు. వర్తమాన జీవితం కంటే భావి జీవితం పైనే నమ్మకం, ఆశ ఉండడం వల్లనే మనిషి అలా ప్రవర్తిస్తున్నాడు. దీనికి సంబంధించి మహాభారతంలో ఒక ప్రస్తావన ఉంది. వనపర్వంలో యక్షుడు ధర్మరాజును ‘కిమాశ్చర్యమ్’.. అంటే ‘ఏది ఆశ్చర్యం’ అని ప్రశ్నంచగా.. ‘‘ప్రతిరోజూ యమలోకానికి ఎందరో వెళుతున్నారు. మిగిలినవారు మాత్రం పోయిన వారిపట్ల సానుభూతి చూపుతూ తాము శాశ్వతం అనుకుంటారు. ఇంతకంటే ఆశ్చర్యం ఏముంది?’’ అని దీని అర్థం. నేటి వర్తమాన జీవితంలో ప్రతి ఒక్కరి జీవన విధానం ఇలానే ఉంది. తాము శాశ్వతం అనుకుంటూ, ఎప్పుడూ రేపటి గురించే ఆలోచిస్తారు. తమ కడుపు కాల్చుకొని తమ భార్యాపిల్లల కోసం దాచి పెడుతున్నారు. తాము పోయినా తమ వాళ్ళు సుఖంగా ఉండాలని తప్పుడు ఆలోచనలతో వర్తమానంలో మనం ఆనందించాల్సిన రోజులను పక్కన పెట్టి, వారి కోసం మన శ్రమనంతటినీ ధారాదత్తం చేస్తున్నాÆ. ఈ ప్రక్రియలో మన సంతానానికి స్వతంత్రంగా బతకడమూ నేర్పడం లేదు. మరి దీనికి పరిష్కార మార్గం ఏమిటన్న ప్రశ్నకు సంతృప్తికరంగా జీవించడమేనన్న సమాధానం లభిస్తుంది. చాలామంది గతంలో జరిగిన సంఘటనల గురించి, రాబోయే విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచనల్లో పడి వర్తమానంలో నివసించడం మానేస్తారు. భవిష్యత్ మనకు భావి జీవితాన్నిస్తు్తంది కానీ వర్తమానం ఎప్పటికప్పుడు ఆనందాన్ని అందిస్తుంది. వర్తమానంలో బతకడం గొప్ప అనుభవం. ఈ అనుభవాన్ని పొందడం అంత సులువు కాదు. దీన్ని కొంత సాధన చేసి అలవర్చుకోవాలి.. భవిష్యత్ గురించి ఆలోచించడం ఎంత ముఖ్యమో అలాగే, వర్తమానంలో జీవించడం కూడా అంతే ముఖ్యమని తెలుసుకున్న నాడు జీవితంలోని ఆనంద మకరందాలన్నీ స్వయంగా ఆస్వాదించే వెసులుబాటు కలుగుతుంది. తృప్తి అనేది మనిషికి ఒక వరం. తృప్తి కలిగి జీవిస్తే ధనికుడికి, పేదవాడికి తేడా అనేదే ఉండదు. అలాంటి తృప్తిని పొందడం కోసం ప్రతి ఒక్కరూ వర్తమానంలో జీవించాలి. ఆ వర్తమానం నుంచి వచ్చిన ఆనందమే తృప్తిని కలిగించి మనకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సొంతం చేస్తుంది. ఇలా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందినపుడే నూరువసంతాల ఆనందకరమైన జీవితాన్ని ఆస్వాదించగలం. ధనం, కీర్తి జీవితానికి ఉప ప్రయోజనాలు కావాలి కానీ అవే పరమలక్ష్యం కాకూడదన్న నిజాన్ని గుర్తించాలి. అలాగే పిల్లలకీ భవిష్యత్తుపై శ్రద్ధను కలుగజేయాలి కానీ, భవిష్యత్ ముఖ్యమని నూరిపోయకూడదు. భవిష్యత్ అవసరమే కానీ, భవిష్యత్ లోనే అంతా ఉందని వారికి నూరిపోస్తే, వర్తమానంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించలేకుండా పోతాం. – దాసరి దుర్గా ప్రసాద్ -
ప్రయాణం... ఒరు మధుర జ్ఞాపకం...
వేసవిలో... ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్... ఈ రెండు ముక్కలు చిన్నప్పుడు వీధిబడిలో తెలియడం గొప్ప. పాస్ట్ అంటే గతం అని తెలియడం చాలా గొప్ప. కాని క్లాస్మేట్ ఒకడు ఒక ఆకు ఎక్కువే చదివి ఎక్స్‌కర్షన్‌కు రెలైక్కి- అబ్బ... ట్రైన్ భలే ఫాస్ట్‌గా పోతోందిరా అంటే అదేదో తప్పు మాట్లాడానుకొని ఒకటే ఏడిపించిన గుర్తు. పాపం చాలా చిన్నబుచ్చుకున్నాడు. కాని దాని అర్థం నిజంగా తెలిశాక ఇప్పటికీ చిన్నబుచ్చుకుంటూనే ఉండాల్సి వస్తోంది. ‘నాన్‌స్టాప్’ అనే పాట ఎనభైల్లో చాలా పాపులర్. ఫలానా ఊరు నుంచి ఫలానా ఊరికి వెళ్లాలంటే మధ్యలో ఎన్నో స్టాపులు. హోల్డాన్లు. రైరైలు. కాని నాన్‌స్టాప్‌లు వచ్చాక వేగం పెరిగింది. ప్రయాణపు కోరిక కూడా పెరిగింది. ఎవరు ఎటుపోయినా ఆగాల్సిన అవసరంలేని వేగానికి అలవాటు పడటం మొదలైంది. ఆటోలు, సెవన్సీటర్లు లేని కాలం అది. రైలు దిగితే, బస్సులో నుంచి కాలు బయటపెడితే రిక్షా ఎక్కాలి. రిక్షా మాత్రమే ఎక్కాలి. కొన్ని గూడు రిక్షాలు, కొన్ని ఓపెన్ రిక్షాలు. బెజవాడ రిక్షాలు ఒకలాగా. మద్రాసు రిక్షాలు ఒకలాగా. ఆకారం ఏదైనా దేని ముచ్చట దానిది. జట్కాలు ఉండేవి. అవి పచ్చగడ్డి వాసన వేసేవి. గుర్రం పరుగు పెడుతూ ఉంటే చర్నాకోలాను బండి చక్రం పళ్లకు తాడనం చేయిస్తూ జట్కావాడు చేసే కటపట శబ్దం ఒక మధుర జ్ఞాపకం. కళ్లెం బిగించిన గుర్రం నోటి దగ్గర కొద్దిగా కారే ఆ తెల్లటి నురగ కూడా. వేసవి వస్తుంది. బంధువులందరూ గుర్తుకు వస్తారు. చిటికెన వేలి దగ్గరి నుంచి బొటన వేలి వరకూ మడుస్తూ మడుస్తూ ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు... మార్కులు, ర్యాంకులు కాదోయ్ పిల్లలకు సంబరం... ఇవిగో టికెట్లు అనే మాటే కదా లడ్ల మూట. ప్రయాణం రోజునే ఎందుకు పులిహార చేస్తారో తెలియదు. ప్రయాణం మధ్యలోకని కొన్ని చల్ల మిరపకాయలతో పాటు కట్టిన పెరుగన్నం పొట్లాలే వైరు బుట్టలోకి ఎందుకు చేరుతాయో తెలియదు. విండో సీటు అతి పెద్ద విలన్. ఒక్క విండో సీటు ఇద్దరు అన్నదమ్ములను నిలువునా చీల్చేస్తుంది. ఇద్దరు అక్కచెల్లెళ్లను బద్ధశత్రువులుగా మార్చేస్తుంది. అమ్మానాన్నలు ఈ తగువు తీర్చలేక కండక్టర్నే సుప్రీం కోర్టుగా భావించి చూస్తారు. లక్కీగా బుర్ర మీసాలున్నవాడు డ్రైవర్‌గా ఉంటే అతన్ని చూపి భయపెడతారు. పాపకు తల తిప్పుతుందేమో... బాబుకు డోకు వస్తుందేమో... కాని ఊరు వచ్చేలోగా నాన్నకు తల తిప్పుతుంది... అమ్మ తలను బయటకు పెట్టి వ్యాక్ వ్యాక్ అంటుంది. కొంగులో కట్టి తెచ్చిన నిమ్మకాయను ముక్కుకు అడ్డుగా పెట్టుకుంటుంది. బస్సుల్లో జామకాయలు వస్తాయి. నీళ్లు కారుతున్న కలర్ సోడాను పట్టుకుని ఒక కుర్రాడు అటూ ఇటూ తిరుగుతుంటాడు. పాప్‌కార్న్ అప్పుడప్పుడే కొత్త. సీల్ చేసిన ప్యాకెట్లలోని పసుపురంగు పాప్‌కార్న్‌ను కళ్ల ముందు ఊపుతారు. ఫుల్లుగా ఉన్న బస్సులో ఒకే ఒక్క సీటు ఖాళీగా ఉంటే దానిలో కూర్చోకూడదని కూర్చుంటే లేపి కండక్టర్ కూచుంటాడని అతి తొందరగా తెలుస్తుంది. బస్సు నడిచినంత సేపు గేర్రాడ్డునే గమనించడం ధ్యానానికి ఏమాత్రం తక్కువ కాదు. దానిని అలా ఎలా పడితే అలా ఆడిస్తూ బస్సును నడిపించేవాడు బ్రూస్లీ కంటే ఏమాత్రం తక్కువ వీరుడు కాడు. కాని పూలమ్మే వాళ్లు మాత్రం రైళ్లనే తమ పుట్టిళ్లు చేసుకుంటారు. మల్లెలమ్మా... జాజులమ్మా... ఇప్పుడే తోట నుంచి వచ్చాయమ్మా అని మెత్తగా పలుకుతూ పచ్చటి తామరాకుల్లో చుడుతూ కంపార్ట్మెంట్లను పరిమళభరితం చేస్తారు. ఏడుకొండల సామీ... ఎక్కాడున్నావయ్యా... ఈ దేశపు అసలు స్వరూపం ఆ యాచకుని పాటలో అవగతమైనట్టు అనిపిస్తుంది. అమ్మ ఎటో చూస్తుంది. నాన్న ఆలోచిస్తూ ఉంటాడు. పాపం... ఇద్దాం నాన్నా అనంటే కొంత చిల్లర అతని జోలెలో పడుతుంది. మధ్య స్టేషన్లో ట్రైన్ దిగి కుళాయి దగ్గరకు పరిగెత్తుకు వెళ్లి సీసాలో నీళ్లు పట్టుకొని తిరిగి రెలైక్కడం ఆ రోజుల్లో అనకొండను పట్టి బంధించడం కంటే తక్కువ సాహసం కాదు. కొందరు తల్లిదండ్రులు పర్మిషన్ ఇస్తారు. కొందరు తల్లిదండ్రులు సీటుకేసి కట్టేస్తారు. రైలు ప్రయాణంలో ఒక థ్రిల్ ఏమిటంటే అది ఉండి ఉండి ఎక్కడో ఆగిపోతుంది. ఎందుకు ఆగిందో తెలియదు. ఎప్పుడు కదిలిందో తెలియదు. అప్పుడు తీరిగ్గా రైలు దిగి పొలాలు చూస్తూ, ట్రాక్ మీదుగా కంపార్ట్మెంట్ నీడలో కొంత దూరం నడుస్తూ, కంకర రాళ్లను విసిరి ఇనుప స్తంభాలను టంగుటంగు మనిపిస్తూ, ఒక కన్ను సిగ్నల్ మీద వేసి, విసురుగా వీచే గాలిలో ఏమీ తోచక హాయిగా తిరగడం నిజంగానే ఒక మధుర జ్ఞాపకం. నేరుగా ఉంటాయనుకున్న పట్టాలు ఎంత వంకరగా ఉంటాయో మలుపు తిరిగి ఉన్న రైలును చూసి తెలుసుకోవడం చాలా మంచి జ్ఞాపకం. ఊళ్లకు వెళితే ఏమవుతుంది? ఊళ్లు తిరిగితే ఏమవుతుంది? ఆ ఊళ్లల్లోని గోడలు తెలుస్తాయి. మన ఊరిలోని సినిమా పోస్టరే ఈ ఊరిలో కూడా అంటిస్తారని అక్కడిలాగే మనుషులు ఇక్కడ కూడా సమానం అని తెలుస్తుంది. బంధువుల్లోని అమ్మ మన అమ్మలాగే ఉంటుందని బంధువుల్లోని నాన్న మన నాన్నలాగే ఉంటాడని కూడా తెలుస్తుంది. అందరూ మాటిమాటికీ నవ్వుకుంటూ ఉంటారని అందరూ పదే పదే కబుర్లు చెప్పుకుంటారని అందరికీ సాటి వాళ్లతో కలిసి ఉండటమే ఇష్టమని తెలియడం చాలా సంతోషంగా ఉంటుంది. ఇది చాలా పెద్ద దారపు ఉండ అనీ ఒక కొసలో మనం ఉంటే మరో కొసలో మనవాళ్లు ఉంటారని ఈ కొసను ఇంకా పొడిగిస్తే ప్రాంతాలు దాటి రాష్ట్రాలు దాటి దేశాలు దాటి అందరం ఒకటేనని అన్ని ప్రాంతాలూ ఒక్కటేనని తెలుసుకున్నట్టు అవుతుంది. జీవితం కొండగుహ. చీకటిగా ఉంటుంది. కాని ప్రయాణం టార్చిలైట్. దానిని చెదరగొడుతుంది. అప్పటి జ్ఞాపకాలు అప్పటివి. ఇప్పుడు చేసేవారి జ్ఞాపకాలు మర్నాటివి. ప్రకృతి ఎండను అందుకే తీక్షణం చేస్తుంది. చర్రుమని వీపు మాడ్చి బ్యాగ్ పుచ్చుకుని బయల్దేరండిరా అని చెప్పడానికే తీక్షణం చేస్తుంది. ఈ వేసవి- నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆదాబ్ తెలంగాణ.