చాలామంది భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అని చింతిస్తూ, దాని బాగుకోసం అనేక రకాలుగా మానసికంగా చింతిస్తూ ఉంటారు. మరి కొంతమంది గతంలో తాము చేసిన తప్పిదాల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ, తమ చుట్టూ ఉన్నవారిని కూడా బాధ పెడుతూ ఉంటారు.
ఈ రెండు అవస్థల మధ్య వారు వర్తమానంలో బతకలేరు. పైగా వర్తమానంలో బతకడం అదేదో గొప్ప నేరంగా భావించి దాని జోలికి వెళ్ళనుగాక వెళ్ళరు. గతం గురించి ఆలోచించడం అవసరమే. అలాగే, భవిష్యత్తు గురించి ఆలోచించడం కూడా అవసరమే. అయితే ఇలా గతం, భవిష్యత్తుల కోసం ఆలోచిస్తూ, వర్తమానాన్ని పట్టించుకోకపోతే జీవితం వృథా అయిపోతుంది.
ఒక వ్యక్తి జీవన సరళి అతను చూసే దృష్టి మీద ఆధారపడి ఉంటుంది. ఆ క్రమంలో వర్తమాన పరిస్థితుల మీద దృష్టి కేంద్రీకరిస్తే చాలా వరకు సమస్యల నుంచి తప్పించుకున్న వాడవుతారు. నిశ్శబ్దాన్ని వినగలగాలి. సూర్యోదయాన్ని ప్రేమించగలగాలి. సూర్యాస్తమయాన్ని ఆస్వాదించగలగాలి. అన్నింటికన్నా ముఖ్యమైంది – ఈ క్షణాన్ని జారిపోకుండా చూసుకోగలగాలి. ఈ విషయాలపై అవగాహన రానంత సేపూ సంతోషం అంటే ఏమిటో తెలియకుండా పోతుంది. మరోవైపు సంతోషం గురించి తెలియడానికి చాలా కాలం పడుతుంది. ఫలితంగా జీవించడం తెలియకుండా పోతుంది.
జీవించడం తెలియకపోతే అసలు ఈ బతుకుకే అర్థం లేకుండా పోతుంది. కనుక జీవితంలో సంతోషంగా ఉండాలంటే వర్తమానంలో బతకాలి. వర్తమానంలో నివసించాలి. గతం భవిష్యత్తూ ముఖ్యమైనవే. అయితే వర్తమానం అంతకన్నా ముఖ్యమైనది. వర్తమానంలో జీవించడం అవసరం అంటే వర్తమానంలో మాత్రమే జీవించమని కాదు. గతం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. భవిష్యత్తు గురించి ప్రణాళికలు రచించాలి. వర్తమానంలో జీవించాలి.
ఒక పశువు తనకు తిండి దొరికేవరకూ వెతుకుతుంది. దొరకగానే తినడం మొదలు పెడుతుంది. అంటే రోజు మొత్తంలో కొంతసేపైనా వర్తమానంలో బతుకుతోందన్నమాట. అలాగే ఒక పిల్లి .. స్వేచ్ఛగా తిరుగుతుంటుంది. ఆకలేస్తే.. ఎలుకను నోటకరచుకుని తిని ఏ నీడ పట్టునో సేదదీరుతుంది. అదీ వర్తమానంలో జీవిస్తోంది. ఇలా పశువులు, పక్షులు, జంతువులు తోటిపశువులతో, తోటిపక్షులతో కలిసి ఆనందంగా రాగద్వేషాలకతీతంగా జీవిస్తున్నాయి. వర్తమానానికి విలువనిస్తున్నాయి. కానీ.. లౌకిక జ్ఞానం ఉన్న మనిషి మాత్రం వర్తమానంలో జీవించలేక పోతున్నాడు.
పశు పక్ష్యాదులకు మనసు, బుద్ధి, ధర్మం వంటివి లేవు. అయినప్పటికీ అవి వర్తమానంలోనే జీవిస్తూ వర్తమానంలోనే ఆనందాన్ని వెదుక్కుంటున్నాయి. అయితే మనిషి మాత్రం తన కోసం జీవించలేకపోతున్నాడు. భవిష్యత్తు కోసం అతివిలువైన వర్తమానాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో భవిష్యత్ గురించి ఆలోచిస్తూ, తాను బతకడం లేదు సరికదా తన తోటివారిని కూడా బతకనివ్వడం లేదు. ఫలితంగా రేపటి కోసం ఆలోచిస్తూ, రేపటి భవిష్యత్ కోసమే దాచుకుంటూ, వర్తమానంలోని ఆనందాన్ని తనకు తానే నాశనం చేసుకుంటున్నాడు. వర్తమాన జీవితం కంటే భావి జీవితం పైనే నమ్మకం, ఆశ ఉండడం వల్లనే మనిషి అలా ప్రవర్తిస్తున్నాడు.
దీనికి సంబంధించి మహాభారతంలో ఒక ప్రస్తావన ఉంది. వనపర్వంలో యక్షుడు ధర్మరాజును ‘కిమాశ్చర్యమ్’.. అంటే ‘ఏది ఆశ్చర్యం’ అని ప్రశ్నంచగా.. ‘‘ప్రతిరోజూ యమలోకానికి ఎందరో వెళుతున్నారు. మిగిలినవారు మాత్రం పోయిన వారిపట్ల సానుభూతి చూపుతూ తాము శాశ్వతం అనుకుంటారు. ఇంతకంటే ఆశ్చర్యం ఏముంది?’’ అని దీని అర్థం.
నేటి వర్తమాన జీవితంలో ప్రతి ఒక్కరి జీవన విధానం ఇలానే ఉంది. తాము శాశ్వతం అనుకుంటూ, ఎప్పుడూ రేపటి గురించే ఆలోచిస్తారు. తమ కడుపు కాల్చుకొని తమ భార్యాపిల్లల కోసం దాచి పెడుతున్నారు. తాము పోయినా తమ వాళ్ళు సుఖంగా ఉండాలని తప్పుడు ఆలోచనలతో వర్తమానంలో మనం ఆనందించాల్సిన రోజులను పక్కన పెట్టి, వారి కోసం మన శ్రమనంతటినీ ధారాదత్తం చేస్తున్నాÆ. ఈ ప్రక్రియలో మన సంతానానికి స్వతంత్రంగా బతకడమూ నేర్పడం లేదు.
మరి దీనికి పరిష్కార మార్గం ఏమిటన్న ప్రశ్నకు సంతృప్తికరంగా జీవించడమేనన్న సమాధానం లభిస్తుంది.
చాలామంది గతంలో జరిగిన సంఘటనల గురించి, రాబోయే విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆలోచనల్లో పడి వర్తమానంలో నివసించడం మానేస్తారు. భవిష్యత్ మనకు భావి జీవితాన్నిస్తు్తంది కానీ వర్తమానం ఎప్పటికప్పుడు ఆనందాన్ని అందిస్తుంది. వర్తమానంలో బతకడం గొప్ప అనుభవం. ఈ అనుభవాన్ని పొందడం అంత సులువు కాదు. దీన్ని కొంత సాధన చేసి అలవర్చుకోవాలి..
భవిష్యత్ గురించి ఆలోచించడం ఎంత ముఖ్యమో అలాగే, వర్తమానంలో జీవించడం కూడా అంతే ముఖ్యమని తెలుసుకున్న నాడు జీవితంలోని ఆనంద మకరందాలన్నీ స్వయంగా ఆస్వాదించే వెసులుబాటు కలుగుతుంది.
తృప్తి అనేది మనిషికి ఒక వరం. తృప్తి కలిగి జీవిస్తే ధనికుడికి, పేదవాడికి తేడా అనేదే ఉండదు. అలాంటి తృప్తిని పొందడం కోసం ప్రతి ఒక్కరూ వర్తమానంలో జీవించాలి. ఆ వర్తమానం నుంచి వచ్చిన ఆనందమే తృప్తిని కలిగించి మనకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సొంతం చేస్తుంది. ఇలా పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందినపుడే నూరువసంతాల ఆనందకరమైన జీవితాన్ని ఆస్వాదించగలం. ధనం, కీర్తి జీవితానికి ఉప ప్రయోజనాలు కావాలి కానీ అవే పరమలక్ష్యం కాకూడదన్న నిజాన్ని గుర్తించాలి. అలాగే పిల్లలకీ భవిష్యత్తుపై శ్రద్ధను కలుగజేయాలి కానీ, భవిష్యత్ ముఖ్యమని నూరిపోయకూడదు. భవిష్యత్ అవసరమే కానీ, భవిష్యత్ లోనే అంతా ఉందని వారికి నూరిపోస్తే, వర్తమానంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించలేకుండా పోతాం.
– దాసరి దుర్గా ప్రసాద్
Comments
Please login to add a commentAdd a comment