ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు
భారత్, తజకిస్తాన్ ప్రతిన
రక్షణ రంగంలో మరింత సహకారం.. పలు రంగాల్లో ఒప్పందాలు
ఉగ్రవాద మూలాలున్న ప్రాంతానికి మన రెండు దేశాలు దగ్గర్లో ఉన్నాయన్న మోదీ
దుషాంబె: ఉగ్రవాదంపై పోరులో సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని భారత్, తజకిస్తాన్ నిర్ణయించాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, తజకిస్తాన్ అధ్యక్షుడు ఎమెమలి రెహ్మాన్ సోమవారం తజక్ రాజధాని దుషాంబెలో రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు సహా విస్తృత అంశాలపై చర్చలు జరిపారు. ప్రతిపాదిత ‘పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, తజకిస్తాన్ త్రైపాక్షిక వాణిజ్య, రవాణా ఒప్పందం’లో భారత్‌ను కూడా చేర్చే విషయంపైనా సంప్రదింపులు జరిపారు. అంతకుముందు వారిద్దరూ కలసి రవీంద్రనాథ్ టాగూర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత సంయుక్తంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అన్యాపదేశంగా పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్‌లను ఉద్దేశిస్తూ.. ఉగ్రవాద మూలాలు బలంగా ఉన్న ప్రాంతానికి భారత్, తజకిస్తాన్‌లు అత్యంత సమీపంలో ఉన్నాయని మోదీ వ్యాఖ్యానించారు. అఫ్ఘాన్‌తో తజకిస్తాన్ కూడా సరిహద్దును పంచుకుంటోంది. అఫ్ఘాన్‌లో శాంతియుత, సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలన్న అక్కడి ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు భారత్, తజక్‌లు సహకరిస్తాయని మోదీ అన్నారు. వాణిజ్యాభివృద్ధికి రెండు దేశాల మధ్య మెరుగైన అనుసంధానత ఆవశ్యకమన్నారు. తజక్లో జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్టుల నిర్మాణంలో సహకరించాలని తజక్ అధ్యక్షుడు మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఇరుదేశాలు సంస్కృతి, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తజకిస్తాన్‌లో ఏర్పాటు చేసిన ఇండియా - తజక్ ఫ్రెండ్షిప్ హాస్పిటల్‌ను మోదీ సందర్శించారు. అందులో భారతీయ వైద్యులు తజక్ సైనికులకు, పౌరులకు వైద్యసేవలందిస్తున్నారు. మోదీ, రెహ్మాన్‌ల చర్చల అనంతరం ఇరుదేశాలు ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. అందులోని
ముఖ్యాంశాలు..
►{పపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, తీవ్రవాదం ప్రబలుతూ.. భారత్, తజకిస్తాన్లకు ముప్పుగా పరిణమించాయి.
►ఉగ్రవాదంపై పోరులో భాగంగా జాయింట్ వర్కింగ్ గ్రూప్‌ను ప్రారంభించి, త్వరగా అధికారస్థాయి చర్చలు మొదలుపెట్టాలి.
►రెండు దేశాలు ద్వైపాక్షిక సంబంధాల్లో ముఖ్యమైన రక్షణ రంగ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి.
►తజకిస్తాన్‌లో భారత్ ద్వారా టెలీ మెడిసిన్ ప్రాజెక్టు రూపకల్పన, అమలు.
పరస్పర వ్యవ‘సాయం’: వ్యవసాయంలో పరస్పర సహకారానికి సంబంధించి ఏర్పాటు చేసిన సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగించారు. సాగు అనుభవాల్ని, శాస్త్ర విజ్ఞానాన్ని, శాస్త్రజ్ఞులను, సమర్థ జల వినియోగ పద్ధతులను.. పంచుకోవడం ద్వారా ఈ రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవాలన్నారు. 17వ శతాబ్దానికి చెందిన పర్షియన్ కవి అబ్దుల్ ఖాదిర్ బెదిల్ సమాధి ‘బాఘ్ ఇ బెదిల్’ సూక్ష్మ చిత్రాన్ని మోదీ తజక్ అధ్యక్షుడికి బహూకరించారు. 1644లో భారత్‌లోని పాట్నాలో జన్మించిన బెదిల్ను తజకిస్తాన్‌లో గొప్ప పర్షియన్ కవిగా పరిగణిస్తారు. ఆరు దేశాల్లో 8 రోజుల విదేశీ పర్యటన ముగించుకుని మోదీ సోమవారం రాత్రి స్వదేశానికి బయల్దేరారు.