సెక్రటేరియల్ స్టాండర్డ్స్ అమలుతో చాలా ప్రయోజనం
హైదరాబాద్: సెక్రటేరియల్ స్టాండర్డ్స్ అమలుతో కంపెనీలకు చాలా ప్రయోజనం కలుగుతుందని ఐసీఎస్ఐ వైస్ ప్రెసిడెంట్ మమతా బినాని పేర్కొన్నారు. ఇటీవల సెక్రటేరియల్ స్టాండర్డ్స్‌పై న్యూఢిల్లీలో జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) జాతీయ సదస్సులో..మమతా బినాని మాట్లాడుతూ.. సెక్రటేరియల్ స్టాండర్డ్స్‌ను అమలుచేస్తున్న కంపెనీలపై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ల, క్రెడిటర్ల విశ్వాసం బలపడుతుందని తెలిపారు. కంపెనీల చట్టం-2013, సెక్షన్ 118 (10) ప్రకారం కంపెనీలు సెక్రటేరియల్ స్టాండర్డ్స్‌ను అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సెక్రటేరియల్ స్టాండర్డ్స్‌ను అమలు చేయడం వల్ల చిన్న, ప్రైవేట్ కంపెనీలకు ఎలాంటి సమస్యలు ఎదురుకావని తెలిపారు. సమావేశంలో ఐసీఎస్ఐ మాజీ ప్రెసిడెంట్ పవన్ కుమార్, ఐసీఎస్ఐ కౌన్సిల్ సభ్యులు వినీత్ చౌదరీ, రంజిత్ పాండే తదితరులు పాల్గొన్నారు.