వెళ్లే వారేతప్ప... వచ్చే వారేరీ?
కాంగ్రెస్ నుంచి రోజురోజుకూ పెరిగిపోతున్న వలసలు ఏపీపీసీసీ అగ్రనేతలను తీవ్రంగా కలవరపరుస్తోంది. మంత్రులుగా పనిచేసిన వారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడగా ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలు సైతం ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతుండడం రాష్ట్ర పార్టీ ముఖ్యులను ఆందోళనకు గురిచేస్తోంది.
మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు, ఆపై సాధారణ ఎన్నికలు వరుసపెట్టి జరగనుండడంతో వీటిని ఎలా ఎదుర్కొనాలో తర్జనభర్జన పడుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్రమంత్రి చిరంజీవి, సీనియర్‌నేతలు బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, సి.రామచంద్రయ్య, వట్టి వసంతకుమార్, మాదాసు గంగాధరం తదితర నేతలు సోమవారం భేటీ అయి తాజా పరిస్థితిపై చర్చించారు. గత కేబినెట్లోని రఘువీరారెడ్డి (పీసీసీ ప్రస్తుత చీఫ్) బొత్స సత్యనారాయణ (మాజీ చీఫ్), ఆనం రామనారాయణరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, సి.రామచంద్రయ్య, కొండ్రు మురళి మాత్రమే మిగిలారు.
మిగతా సీమాంధ్ర మంత్రుల్లో పలువురు ఇప్పటికే ఇతర పార్టీల్లో చేరగా, తక్కినవారు రేపోమాపో కాంగ్రెస్‌ను వీడుతారని ప్రచారం జరుగుతోంది. కేంద్రమంత్రుల్లో పురందేశ్వరి బీజేపీలో చేరగా ఇతర మంత్రులు పోటీకి గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎంపీలు మొత్తం పార్టీని వీడారు. సీమాంధ్రకు చెందిన 97 మంది పార్టీ ఎమ్మెల్యేల్లో మిగిలిన వారి సంఖ్య వేళ్లమీద లెక్కించేలా మారింది. ఈ తరుణంలో వచ్చే ఎన్నికలకు పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులే కరవయ్యారు. నేతలు వలసలు పోయిన నియోజక వర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలపై దృష్టి సారించాలని నిర్ణయించారు. యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ, మహిళా విభాగాలలోని నేతలను పోటీకి అంగీకరించేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.