7 నెలలుగా వేతనాలు ఇవ్వరా?
ఎన్డీఎస్ఎల్ జాప్యం వెనక కుట్ర ఉంది
కాంగ్రెస్ కిసాన్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి
మెదక్ రూరల్:వైఎస్ హయాంలోనే కార్మికులకు, కర్షకులకు సమన్యాయం జరిగిందని, రైతుల పాలిట దేవునిగా నిలిచిన ఘనత వైఎస్‌దేనని కాంగ్రెస్ పార్టీ కిసాన్‌సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. మెదక్ మండలం మంభోజిపల్లి ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ అక్రమ లేఆఫ్ ఎత్తివేయాలంటూ 66 రోజులుగా కార్మికులు రిలే దీక్షలు చేస్తున్నారు. గురువారం దీక్షలకు మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు సునీతాలకా్ష్మరెడ్డి, మాజీ టీపీసీసీ అధికార ప్రతినిధి పి.శశిధర్‌రెడ్డితో కలిసి కోదండరెడ్డి సంఘీభావం ప్రకటించారు.
అనంతరం మాట్లాడుతూ ఎన్డీఎస్ఎల్ లేఆఫ్ ప్రకటించి కార్మికుల కష్టార్జితమైన పీఎఫ్‌ను యాజమాన్యం దోచుకుంటున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అసలు కార్మిక శాఖ మంత్రి ఉన్నారా? ఉంటే ఎన్డీఎస్ఎల్ కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై ఎందుకు స్పందించడం లేదన్నారు. ఎన్డీఎస్ఎల్ స్వాధీనం చేసుకోకుండా వదిలేయడం వెనుక కుట్ర ఉందన్నారు. మెదక్, బోధన్, మెట్పల్లి ఎన్డీఎస్ఎల్లలో పనిచేసే కార్మికులు రోడ్డున పడ్డారని, 7 నెలలుగా వేతనాలు లేక అర్ధాకలితో అలమటిస్తున్నారని వాపోయారు.
మూడు జిల్లాల కార్మికులను, రైతులను ఏకం చేసి ఉద్యమిస్తామన్నారు. మాజీ మంత్రి సునీతారెడ్డి మాట్లాడుతూ బంగారు తెలంగాణలో కార్మికుల బతుకులను రోడ్డున పడేస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాజీ టీపీసీసీ అధికార ప్రతినిధి పి.శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గెలవగానే ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేస్తామన్న టీఆర్ఎస్ ప్రభుత్వం నేడు ఆ హామీని ఎందుకు విస్మరించిందని ప్రశ్నించారు.