ఫిఫాలో సంస్కరణలు తేవాలి: బాచ్
లాసానే: అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న అంతర్జాతీయ ఫుట్‌బాల్ సంఘాల సమాఖ్య (ఫిఫా)లో కఠినమైన సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ అభిప్రాయపడ్డారు. 2002 వింటర్ ఒలింపిక్స్‌ను సాల్ట్ లేక్ సిటీకి ఇచ్చే విషయంలో వెలుగు చూసిన ఓటుకు నోటు వ్యవహారంకన్నా ప్రస్తుత ఫిఫాలో కొనసాగుతున్న సంక్షోభం ఎక్కువని అన్నారు. ‘ఫిఫాలో సంస్కరణలు అమలయ్యేందుకు మేం ప్రోత్సహిస్తాం. దీనికోసం వారు ప్రయత్నిస్తే చాలా మంచిది. నిజానికి ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమే అయినా ప్రస్తుతం చాలా అవసరం’ అని బాచ్ అన్నారు.