భారీ బందోబస్తు మధ్య రాష్ట్రపతి పర్యటన
అనంతపురం క్రైం/సిటీ/బుక్కరాయసముద్రం, న్యూస్‌లైన్ : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జిల్లా పర్యటన సోమవారం పోలీస్ పహారా మధ్య ముగిసింది. నగర శివారులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌తో పాటు నీలం సంజీవరెడ్డి స్టేడియంలోని సభాస్థలికి అర కిలోమీటర్ వరకు జనం ఎవరూ కనబడకుండా పోలీసు శాఖ చర్యలు తీసుకుంది. సభ ఆవరణలోకి విద్యార్థులను మినహా మరెవ్వరినీ అనుమతించలేదు. పౌర సంబంధాల శాఖాధికారి జారీ చేసిన వాహనాల పాస్‌లు ఉన్నా పోలీసులు కొన్ని చోట్ల అత్యుత్సాహం ప్రదర్శించారు. వాహనాలను ఎక్కడికక్కడ ఆపేసి వీఐపీలను నడిపించారు. రాష్ట్రపతి కాన్వాయ్ నగరంలోకి రాకముందే గంటకు పైగా ట్రాఫిక్‌ను నిలిపివేశారు.
రుద్రంపేట కాలనీ, నడిమి వంక, ఒకటి, నాలుగు, ఐదో రోడ్డు, లక్ష్మినగర్, నీలం సంజీవరెడ్డి బంగా రోడ్డుల్లో రెండున్నర గంటల పాటు ట్రాఫిక్‌ను నిలిపేశారు. ఈ క్రమంలో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఉత్సవాలు ముగిశాక స్కూల్ విద్యార్థులు తిరిగి ఇంటికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కిలోమీటర్ మేర నడుచుకుంటూ పార్కింగ్ స్థలానికి వెళ్లి బస్సు ఎక్కాల్సి వచ్చింది. సుమారు 15 వేల సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. 20 మొబైల్ టీంలు ఏర్పాటు చేశారు. ఎత్తై భవనాలపైకి పోలీసులు చేరి నిఘా కెమెరాలతో రాకపోకలు గుర్తించారు.
పీటీసీ సమీప ప్రాంతాలు, కాన్వాయ్ వచ్చే ప్రాంతాల్లో దుకాణాలను మూసి వేయించారు. బాంబు, డాగ్ స్క్వాడ్లను రంగంలోకి దింపి రహదారులు, వంతెలన వద్ద సోదాలు నిర్వహించారు. చివరికి ఇళ్లలోని వారిని కూడా బయటకు రానివ్వలేదు. ఈ క్రమంలో నాల్గో రోడ్డులోని ఓ గృహిణి పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ‘మా ఇంటి ముందు కూర్చోవడానికి మీ పర్మిషన్ తీసుకోవాలంటే ఎలా?’ అంటూ నిలదీసింది. అయితే పోలీసులు వినకపోవడంతో ఇంట్లోకెళ్లిపోయింది.