రాష్ట్రపతి పాలన ఎత్తేస్తారా?
కాంగ్రెస్ వైఖరి పరాకాష్ఠకు చేరింది. తమ పార్టీలో టీఆర్ఎస్ విలీనం లేదా పొత్తు.. ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగని పక్షంలో రాష్ట్రపతి పాలన ఎత్తేసి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ లేదా మరో తెలంగాణ నాయకుడిని ముఖ్యమంత్రిగా చేసి అసెంబ్లీ ఎన్నికలు కూడా వాయిదా వేయాలనే ఉద్దేశంలో ఉన్నట్లు కనపడుతోంది. లోక్సభకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఏమాత్రం నోరు విప్పడంలేదు.
అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలంటూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గత కొంత కాలంగా అధిష్ఠానాన్ని కోరుతున్నారు. కానీ తెలంగాణ నేతలు మాత్రం అలా వాయిదాలు వద్దంటున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఎటూ కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో పరాభవం తప్పదని, అలాంటప్పుడు ఆ ప్రభావం తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల మీద స్పష్టంగా ఉంటుందని భయపడుతున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం టీఆర్ఎస్ నిర్ణయాన్ని బట్టి ఏదో ఒకటి నిర్ణయించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. రాజకీయ క్రీడల కోసం ఇప్పటికే రాష్ట్రాన్ని బలిపీఠం మీదకు నెట్టేసి.. రాష్ట్రపతి పాలన విధించి, ఇప్పుడు మళ్లీ తన సొంత ప్రయోజనాల కోసం అవసరమైతే మైనారిటీ సర్కారునైనా ఏర్పాటుచేయాలని తలపెడుతోంది.