Presidential Election 2017
-
అట్టహాసంగా కోవింద్ నామినేషన్
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా మూడు సెట్లు దాఖలు - బలపరిచిన ప్రధాని మోదీ, అమిత్ షా, మిత్రపక్షాల సీఎంలు - 28 పార్టీల నేతలు, 15 రాష్ట్రాల సీఎంల హాజరు.. శివసేన గైర్హాజరు న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, 15 రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రుల సమక్షంలో ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ అట్టహాసంగా రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేశారు. ఎన్డీఏ, ఎన్డీఏయేతర పార్టీల ముఖ్యనేతల హాజరుతో శుక్రవారం లోక్‌సభ సెక్రటరీ జనరల్ కార్యాలయంలో జరిగిన నామినేషన్ పర్వం బీజేపీ బలప్రదర్శన వేదికను తలపించింది. కోవింద్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మూడు సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి సెట్ నామినేషన్ పత్రంపై మోదీ సంతకం చేయగా, అద్వానీ సహా 60 మంది బలపరిచారు. రెండో సెట్‌ను బీజేపీ చీఫ్ అమిత్ షాతో మరి కొందరు నేతలు ప్రతిపాదించారు. బీజేపీ మిత్రపక్షాల నేతలు ప్రకాశ్ సింగ్ బాదల్, చంద్రబాబు నాయుడుతో పాటు మరికొందరు నేతలు మూడో సెట్‌పై సంతకాలు చేశారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రాకు నామినేషన్ పత్రాలు అందచేశారు. జూన్ 28న నామినేషన్ల చివరి తేదీన నాలుగో సెట్ దాఖలు చేస్తారు. 28 పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారని బీజేపీ తెలిపింది. కోవింద్‌కు మద్దతు ప్రకటించిన శివసేన గైర్హాజరు కాగా.. తమకు ఆహ్వానం అందలేదని పేర్కొంది. పరీకర్, ముఫ్తీ మినహా ఎన్డీఏ సీఎంలందరూ హాజరు గోవా సీఎం పరీకర్, కశ్మీర్ సీఎం ముఫ్తీ మినహా బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల సీఎంలందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్డీఏయేతర ముఖ్య మంత్రుల్లో తెలంగాణ సీఎం చంద్రశేఖర్‌రావు, తమిళనాడు సీఎం పళనిస్వామిలు హాజరయ్యారు. బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అడ్వాణీ, మురళీమనోహర్ జోషీలు కూడా హాజరయ్యారు. బీజేడీ తరఫున ఒడిశా మంత్రి హాజరుకాగా.. జేడీయూ నుంచి ఎవరూ పాల్గొనలేదు. దేశ సమగ్రాభివృద్ధికి కృషి.. కోవింద్: నామినేషన్ అనంతరం కోవింద్ మాట్లాడుతూ ‘రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమని నా నమ్మకం. అందుకు నా వంతు ప్రయత్నిస్తా. సాధ్యమైనంతమేరకు దేశ అత్యున్నత కార్యాలయం గౌరవం కాపాడతా.. దేశ సమగ్రాభివృద్ధికి, యువత ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు కృషిచేస్తా.. ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులంతా మద్దతివ్వాలని కోరుతున్నా’నని పేర్కొన్నారు. -
‘రాష్ట్రపతి రేసులో నేను లేను’
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పేరు బలంగా తెరపైకి రావడంతో ఈ కథనాలపై ఆమె స్పందించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తాను అధికార పార్టీ అభ్యర్థిగా నిలబడనున్నట్టు వచ్చిన కథనాలు వదంతులు మాత్రమేనని ఆమె తోసిపుచ్చారు. వచ్చే నెల 17న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. అయినప్పటికీ ఇటు అధికార బీజేపీ కానీ, అటు ప్రతిపక్షాలు కానీ తమ అభ్యర్థిని ప్రకటించకుండా సస్పెన్స్ ను కొనసాగిస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల రేసులో పలువురి పేర్లు ఉన్నట్టు కథనాలు వచ్చాయి. అందులో సుష్మా పేరు కూడా ఉందని, బీజేపీ, ఆరెస్సెస్ సన్నిహిత వర్గాల ప్రకారం సుష్మ పేరు దాదాపు ఖరారైనట్లుగా జాతీయ మీడియా కథనాలు గుప్పించింది. ‘అవి రూమర్స్ మాత్రమే. నేను ప్రస్తుతం విదేశాంగమంత్రిని. (రాష్ట్రపతి అభ్యర్థిపై) మీరు అడుగుతున్న ప్రశ్న అంతర్గత వ్యవహారం’ అని సుష్మా శనివారం విలేకరులతో అన్నారు. రాష్ట్రపతి అభ్యర్థి రేసులో మీరు ఉన్నారా? అన్న ప్రశ్నకు ఆమె ఈ విధంగా స్పందించారు. -
‘తెలంగాణకు సాయం చేస్తే మద్దతిస్తాం’
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తామని టీఆర్ఎస్ పార్టీ వెల్లడించింది. తెలంగాణకు సహాయం చేస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని లోక్‌సభలో టీఆర్ఎస్ నాయకుడు ఏపీ జితేందర్ రెడ్డి ‘పీటీఐ’తో చెప్పారు. ‘తెలంగాణకు ఎప్పుడు మేలు చేసినా మేము ఎన్డీఏ వెంట ఉంటాం. మా రాష్ట్రానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఎన్డీఏతో ఉండబోమ’ని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో సరైన సమయంలో తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది. ఈలోపు రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. మరోవైపు విపక్షాల తరపున ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని నిజామాబాద్ ఎంపీ కె. కవిత అంతకుముందు తెలిపారు. ‘జాతీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఎవరికి మద్దతు ఇవ్వాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తగిన నిర్ణయం తీసుకుంటార’ని ఆమె చెప్పారు.