ఢిల్లీలో డీకే అరుణ బిజీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు మాజీ మంత్రి డీకే అరుణ పార్టీ పెద్దలకు స్పష్టం చేశారు. మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలను కలిశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్‌తో బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు. నాగర్‌కర్నూలు లోక్‌సభ సభ్యుడు నంది ఎల్లయ్య కూడా డీకే అరుణ వెంట ఉన్నారు.
పీసీసీ అధ్యక్షుడిగా పొన్నాల లక్ష్మయ్యను మార్చే యోచన ఉంటే తన పేరు పరిశీలించాల్సిందిగా పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అసెంబ్లీలో పార్టీ శాసనసభా పక్షం నాయకత్వ బాధ్యతల కోసం కూడా డీకే అరుణ తీవ్ర ప్రయత్నాలు చేశారు. సీనియర్ నేత జానారెడ్డికి ఆ పదవి దక్కడంతో డీకే అరుణ ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ఓ ప్రధాన సామాజికవర్గానికి చెందిన మహిళగా తనకు బాధ్యతలు అప్పగిస్తే పార్టీని బలోపేతం చేస్తానని దిగ్విజయ్‌కు చెప్పినట్లు సమాచారం.
ఎన్నికల సందర్భంగా మహిళలకు ముఖ్యమంత్రిగా అవకాశమిస్తామని పార్టీ చేసిన ప్రకటనను డీకే ఈ సందర్భంగా గుర్తు చేసినట్లు సమాచారం. గతంలో పీసీసీ అధ్యక్ష పదవిని మహిళలకు కేటాయించని విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ తాను పీసీసీ రేసులో ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు సన్నిహితవర్గాలు వెల్లడించాయి. పీసీసీ రేసులో తాను లేనంటూ కొందరు చేస్తున్న ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టేందుకే పార్టీ నేతలను తమ నాయకురాలు కలిసినట్లు డీకే సన్నిహితులు చెబుతున్నారు.