తెలంగాణలో రాష్ట్రపతి పాలన ఎత్తివేత
- ఏపీలో ప్రభుత్వం ఏర్పడే దాకా కొనసాగింపు
- గెజిట్ విడుదల చేసిన రాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ ఆదివారం విడుదల చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటునకు టీడీపీ సమయం కోరిన నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం ఏర్పాటు అయ్యేవరకు రాష్ట్రపతి పాలన అమలులో ఉంటుందని గెజిట్‌లో పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితుల నేపథ్యంలో మార్చి 1 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని సుప్త చేతనావస్థలో పెడుతూ రాష్ట్రపతి పాలన విధించిన విష యం తెలిసిందే.
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014 ప్రకారం జూన్ 2న అపాయింటెడ్ డే అమలులోకి రానున్నట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇరు ప్రాం తాల్లో ఇటీవల నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రాంతంలో స్పష్టమైన మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్ తాము జూన్ 2న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు గవర్నర్ నరసింహన్‌కి తెలియజేసింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్(సీమాంధ్ర)లో మెజార్టీ సాధించిన టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మరిం త గడువు కావాలని కోరింది. ఇరు పార్టీల ప్రతిపాదనలు పరిగణనలోకి తీసుకున్న గవర్నర్ రాష్ట్రపతికి ఓ నివేదిక పంపారు. వీటిని పరిశీలించిన అనంతరం తెలంగాణలో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తున్నట్టు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసేవరకు రాష్ట్రపతి పాలన కొనసాగుతుందని గె జిట్ విడుదల చేశారు.