ఒకేరోజు ఇద్దరు మాజీ అధ్యక్షుల మృతి
నేడు ప్రపంచాన్ని శాసిస్తున్న అగ్రరాజ్యం అమెరికా. శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిన అమెరికా కూడా ఒకప్పుడు బ్రిటీష్ పాలిత దేశమే. అనేక దేశాల్ని తన అధీనంలోకి తెచ్చుకుని, అరాచక పాలన సాగించిన బ్రిటన్.. అమెరికాలోనూ అదే తంతు కొనసాగించింది. బ్రిటన్ రాచరికపు పాలనలో ఏళ్ల తరబడి మగ్గిన అమెరికా కూడా స్వాతంత్య్రం కోసం పోరాడాల్సి వచ్చింది. బ్రిటన్ పాలనపై అమెరికా తొందరగానే మేల్కొని, పోరాడడంతో చివరకు 1776 జూలై 4 న స్వతంత్ర దేశంగా మారింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా వాసులు ఒక రోజు ముందుగానే సంబరాలు మొదలుపెట్టారు. పెద్ద పెద్ద భవంతులను లైట్లతో అలంకరించి వేడుకలకు సిద్ధమయ్యారు.
సరిగ్గా అదే రోజు ఇద్దరు అధ్యక్షుల మరణం..
అయితే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అగ్ర నేతలకే అమెరికా అధ్యక్ష పీఠం దక్కిందన్న విషయం అందరికీ తెలిసిందే. అగ్రరాజ్యానికి మొదటి అధ్యక్షుడిగా జార్జ్ వాషింగ్టన్ ఎన్నియ్యారు. రెండో అధ్యక్షుడిగా జాన్ ఆడమ్స్, మూడో అధ్యక్షునిగా థామస్ జెఫర్ సన్ ఎన్నికై అమెరికాకు విశిష్ట సేవలు అందజేశారు. ఈ నేతల చావులోనూ కాస్త పోలికలు ఉండటం మనం గమనించాలి. అదేంటంటే.. అమెరికాకు స్వాతంత్య్రం వచ్చిన సరిగ్గా 50 ఏళ్ల తర్వాత ఒకే రోజు(1826 జూలై 4)న మాజీ అధ్యక్షులు జాన్ ఆడమ్స్(రెండో అధ్యక్షుడు), జెఫర్ సన్(మూడో అధ్యక్షుడు) ఇద్దరూ మరణించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు అమెరికా వాసులు వీరిని స్మరించుకుంటారు.