రాష్ట్రపతి ఎన్నికల సందడి
రాష్ట్రపతి పదవికి అభ్యర్థిని ఎంపిక చేసే వ్యవహారంలో తొలి అంకం ప్రారంభ మైంది. సరిగ్గా మరో రెండు నెలల్లో... అంటే జూలై 25న ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిష్క్రమించి ఆ స్థానంలో కొత్తవారు బాధ్యతలు స్వీకరిస్తారు. రెండోసారి ఈ పదవికి పోటీపడదల్చుకోలేదని ప్రణబ్ తేల్చగా... ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న అంశాన్ని చర్చించడానికి శుక్రవారం యూపీఏ మిత్ర పక్షాలు సమావేశమవుతున్నాయి. అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని ఎంపిక చేయడానికి ఎన్డీఏ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఏకగ్రీవ ఎన్నికకు అభ్యంతరం లేదంటూ కాంగ్రెస్ ఇప్పటికే చెప్పినా... విజయావకాశాలు మెరుగ్గా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అలాంటి ప్రయత్నం చేస్తుందన్న నమ్మకం లేదు.
రాజ్యసభలో ఎన్డీఏకు సంఖ్యా బలం పెద్దగా లేకపోయినా ఇతరత్రా అంశాలు దానికే అను కూలంగా ఉన్నాయి. యూపీఏ మిత్రపక్షాల సమావేశంలో పాల్గొనడానికొచ్చిన మమత గురువారం ప్రధాని నరేంద్ర మోదీని కలవడంతోపాటు రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవ ఎన్నికే అన్నివిధాలా మంచిదనడం, బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ సమావేశానికి గైర్హాజరు కానుండటం గమనిస్తే విపక్ష శిబిరం ఏమంత పటిష్టంగా లేదని అర్ధమవుతుంది. ఇది ‘సిద్ధాంత సమరం’ అని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటిం చింది గనుకా... బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు సన్నద్ధమవుతున్న విపక్షాలకు రాష్ట్రపతి ఎన్నిక తొలి పరీక్ష అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇప్పటికే ప్రకటించి ఉన్నారు గనుకా విపక్షాల అభ్యర్థి రంగంలో ఉంటారనుకో వచ్చు. కానీ ఆ పోటీ నామమాత్రంగా మిగిలిపోవడానికే అవకాశాలు ఎక్కువు న్నాయి. విపక్షంలో ఉన్నా రాష్ట్రపతి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన చరిత్ర
ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు దయనీయ స్థితిలో ఉంది. ఆ పార్టీకి పార్లమెంటులో చెప్పు కోదగ్గ సంఖ్యా బలం లేదు. రాష్ట్రాల్లోనూ అది అంతంతమాత్రమే. సమీప భవిష్యత్తులో అది పుంజుకోగలదన్న నమ్మకం ఎవరికీ లేదు. ఈ కారణాలన్నిటి వల్లా ఆ పార్టీ అభిప్రాయాలకు ఇతర విపక్షాలు పెద్దగా విలువనిస్తాయని అను కోనవసరం లేదు.
నిజానికి రాష్ట్రపతి పదవి అలంకారప్రాయమైనది. కానీ అది దేశ రాజ్యాంగానికి, గణతంత్ర రాజ్యానికీ ప్రతీక. పరిమితమైన అధికారాలే ఉన్నా ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఆ పదవి పేరిటే నడుస్తాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ముసాయిదా ఆర్డినెన్స్లపైనో, పార్లమెంటు అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులపైనో సంతకాలు చేయడానికి పరిమితమయ్యే రాష్ట్రపతి ఒక్కోసారి కీలకపాత్ర పోషిం చాల్సి రావొచ్చు కూడా. దేశ చరిత్రలో బిల్లుల్ని లేదా ఆర్డినెన్స్లనూ రాష్ట్రపతి తిప్పి పంపిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అరుదుగానే కావొచ్చుగానీ... రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన సిఫార్సును నిరాకరించిన సందర్భం... ఆర్డినెన్స్‌పై వివరణ కోరి వెనక్కు పంపిన సందర్భం అక్కడక్కడా లేకపోలేదు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లేనప్పుడు, సంకీర్ణ రాజకీయాలు అయోమయంగా ఉన్నప్పుడు రాష్ట్రపతి పాత్ర అత్యంత కీలకమైనది. అయితే కేంద్రంలో ఇప్పుడు పేరుకు ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నా బీజేపీకి సొంతంగానే అవసరమైనంత మెజారిటీ ఉంది గనుక అలాంటి పరిస్థితే ఏర్పడదు.
నూతన రాష్ట్రపతిని పార్లమెంటు ఉభయ సభల సభ్యులు, రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ సభ్యులు ఉండే ఎలక్టోరల్ కాలేజీ ఎన్ను కుంటుంది. ఎమ్మెల్యేల ఓట్ల విలువ ఆయా రాష్ట్రాల్లోని జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఉంటుంది. ఎలక్టోరల్ కాలేజీలోని ఓట్ల విలువ 10,98,824. అత్యధిక జనాభా గల యూపీలోని ఎమ్మెల్యేల ఓట్ల విలువ 83,824. అక్కడ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించిన బీజేపీకే ఇందులో సింహభాగం ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు. బీజేపీ ప్రస్తుతం పది రాష్ట్రాలు–యూపీ, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, అస్సాం, ఉత్తరాఖండ్, అరుణాచల్, ఛత్తీస్‌గఢ్‌లలో సొంతంగా ప్రభుత్వాలు నడుపుతోంది. జమ్మూ–కశ్మీర్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్, సిక్కింలలో మిత్రులతో అధికారం పంచుకుంటున్నది. 2007లో ఎన్డీఏ మిత్రపక్షంగా ఉంటూ కూడా యూపీఏ అభ్యర్థి తమ రాష్ట్రానికి చెందిన ప్రతిభా పాటిల్ కనుక ఆమెకే మద్దతిస్తామని చెప్పిన మిత్రపక్షం శివసేన ఈసారి కూడా బీజేపీని ఇరుకున పెట్టే అవకాశం ఉంది.
యూపీఏ అభ్యర్థిగా శరద్ పవార్ రంగంలో ఉంటే అది మరోసారి మరాఠీ అభిమానం పేరుతో అటువైపు వెళ్లినా ఆశ్చర్యం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్, తమిళనాడులో అధికార అన్నా డీఎంకే ఎన్డీఏ అభ్యర్థికే మద్దతిస్తామని చెప్పాయి. తెలంగాణలో టీఆర్ఎస్, ఒదిశాలో బీజేడీ సైతం ఆ పనే చేయవచ్చు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పినట్టు రాష్ట్రపతిలాంటి రాజ్యాంగ పదవికి ఏకగ్రీవ ఎన్నిక జరిగేలా చూడటమే ఉత్తమం.
జరుగుతున్న పరిణామాలు గమనిస్తే సీనియర్ బీజేపీ నేత ఎల్కే ఆడ్వాణీకి ఎన్డీఏ అభ్యర్థిత్వం దక్కకపోవచ్చునని అర్ధమవుతుంది. అయితే రాష్ట్రపతి పదవి కుండే విలువనూ, గౌరవప్రతిష్టలనూ నిలబెట్టగలవారే, రాజ్యాంగ స్ఫూర్తి అమల య్యేలా చూడగలిగేవారే, క్లిష్ట పరిస్థితుల్లో చొరవతో ఒక మంచి మాటనో, సల హానో చెప్పగలిగినవారే ఆ పదవిని అధిష్టిస్తే దేశ గౌరవం ఇనుమడిస్తుంది. దేశా ధిపతిగా గణతంత్ర వ్యవస్థ పవిత్రతనూ, దాని జీవధాతువునూ సంరక్షించవల సిన కర్తవ్యం రాష్ట్రపతికి ఉంటుంది. అధికారంలో ఉన్నవారికి రబ్బర్ స్టాంపులా మారి, వారు చెప్పినట్టల్లా విని దేశాన్ని సంక్షోభం అంచులకు తీసుకుపోవడంలో తమ వంతు పాత్ర వహించిన రాష్ట్రపతులు మనకు లేకపోలేదు. అలాంటి వారివల్ల అధికారంలో ఉండేవారికి తప్ప దేశానికి ఒరిగేదేమీ ఉండదు. దేశ పౌరులందరికీ ఆదర్శప్రాయం కాగలిగిన వ్యక్తిత్వం ఉన్న నేత రాష్ట్రపతి పదవికి ఎన్నిక కావడం అవసరం. అభ్యర్థిని ఎంపిక చేసేటపుడు పార్టీలు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని అందరూ కోరుకుంటారు.