ఆన్లైన్ మోసాల కట్టడికి వినూత్న విధానం
ప్రముఖ టెలికాం ఆపరేటర్లలో ఒకటైన ఎయిర్టెల్ తన కస్టమర్లను ఆన్లైన్ మోసాల నుంచి రక్షించేందుకు ప్రయత్నాలు చేపట్టింది. పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్ స్కామ్(పాస్వర్డ్లు, క్రెడిట్ కార్డ్ నంబర్లు లేదా వ్యక్తిగత వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడానికి హ్యాకర్లు ఉపయోగించే ఒక రకమైన సైబర్ క్రైమ్) నుంచి కంపెనీకి చెందిన 38 కోట్ల మంది సబ్‌స్కైబర్లకు మెరుగైన భద్రత అందించేందుకు కొత్త సాంకేతికతను అమలు చేయనున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు.కొత్త టెక్నాలజీ అమలు సుమారు 80 శాతం పూర్తయిందని కంపెనీ తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక చర్యల వల్ల వన్ టైమ్ పాస్‌వర్డ్‌ల(ఓటీపీ) దుర్వినియోగాన్ని నిరోధించడం, హానికరమైన లింక్‌లను కట్టడి చేయడంపై దృష్టి సారించినట్లు పేర్కొంది. అధునాతన కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లను ఉపయోగించడం ద్వారా ఎయిర్టెల్ తన వినియోగదారులకు సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టెక్నాలజీ వల్ల రియల్ టైమ్‌లో కస్టమర్లకు వచ్చే మోసపూరిత కాల్స్, స్కామ్ మెసేజ్‌లను గుర్తించి వాటిని అరికడుతుంది. దాంతో వినియోగదారులు ఆన్లైన్ మోసానికి గురవుతామనే భయం లేకుండా కమ్యూనికేట్ చేయడానికి, ఆన్లైన్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి వీలవుతుందని సంస్థ పేర్కొంది.పరిష్కారం పరిమితంగానే..ఈ టెక్నాలజీ పరిష్కారం పరిధి ప్రస్తుతం ఎస్ఎంఎస్, కాల్ ఆధారిత మోసాలకు మాత్రమే పరిమితమైంది. ఎన్క్రిప్షన్ ప్రోటోకాల్స్ కారణంగా వాట్సాప్, టెలిగ్రామ్ వంటి ఓవర్-ది-టాప్ (ఓటీటీ) కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి ఉత్పన్నమయ్యే స్పామ్, మోసాలకు ఈ సాంకేతికత పరిష్కరించదని అధికారులు స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్లు ఈ మోసాలపై అవగాహనలేని వినియోగదారులను లక్ష్యంగా చేసుకోవడానికి ఈ ఎన్క్రిప్టెడ్ ప్లాట్‌ఫామ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కొన్ని టెక్నికల్ కారణాలవల్ల డిజిటల్ మోసాలు పెరుగుతున్న అంశాన్ని ప్రస్తావిస్తూ ఎయిర్టెల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు రక్షణ కల్పించేందుకు రెగ్యులేటరీ జోక్యం చేసుకోవాలని తెలిపింది. ఓటీటీ కమ్యూనికేషన్ సేవలను రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ కిందకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)ను కోరింది. ఓటీటీ యూజర్లకు నో యువర్ కస్టమర్ (కేవైసీ) వెరిఫికేషన్ తప్పనిసరి చేయడం, ఈ ప్లాట్‌ఫామ్‌లను సెంట్రలైజ్డ్ స్పామ్ డిటెక్షన్ సిస్టమ్స్‌లోకి ఇంటిగ్రేషన్ చేయడం వంటివి ఇందులో ఉన్నాయి.ఇదీ చదవండి: యాపిల్ సాఫ్ట్వేర్ రీడిజైనింగ్.. కీలక మార్పులు ఇవేనా?ఏకీకృత విధానం అవసరం..డిజిటల్ మోసాలకు వ్యతిరేకంగా సమగ్ర వ్యూహాన్ని రూపొందించడానికి టెలికాం ఆపరేటర్లు, రెగ్యులేటర్లు, టెక్నాలజీ ప్రొవైడర్లతో సహా వాటాదారుల మధ్య సహకారం అవరసమని నిపుణులు సూచిస్తున్నారు. ఎయిర్టెల్ తన ప్రయత్నాలతో ఆన్లైన్ మోసాలను కట్టడి చేసేందుకు ముందడుగు వేసినప్పటికీ, ఓటీటీ ద్వారా ఉత్పన్నమయ్యే మోసాలపై పోరాటానికి, అన్ని కమ్యూనికేషన్ ఛానళ్లను రక్షించడానికి ఏకీకృత విధానం అవసరమని చెబుతున్నారు.