కల్తీ కల్లు నివారణకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: కల్తీకల్లు కారణంగా ఇటీవల మహారాష్ట్రలో సంభవించిన మరణాల నేపథ్యంలో రాష్ట్రంలో కల్లు విధానాన్ని మరింత పటిష్టంగా రూపొందించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని కొన్ని కల్లు కాంపౌండ్లలో అల్ప్రాజోలం, డైజోఫాం, క్లోరల్ హైడ్రేడ్ వంటి మానసికంగా మత్తుకు బానిసలను చేసే విషతుల్యమైన పదార్థాలను వినియోగిస్తున్నట్లు పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సహజసిద్ధమైన కల్లును మాత్రమే కాంపౌండ్లలో విక్రయించేలా చూసేందుకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ ప్రభుత్వాన్ని కోరారు.
ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. రాష్ట్రంలో 4,478 కల్లు గీత సహకార సంఘాలు(టీసీఎస్) ఉండగా, 3,762 గీత వృత్తి సంఘాలు(టీఎఫ్టీ) ఉన్నాయని, వీటి నేతృత్వంలో కల్లు దుకాణాలు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయని పేర్కొన్నారు. కల్తీ కల్లు వల్ల అనారోగ్యం పాలు కావడం, దీనికి బానిసలుగా మారి పిచ్చివాళ్లుగా తయారవడం వంటి విపరీత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్నారు.
మహారాష్ట్ర తరహా ఘటనలు రాష్ట్రంలో జరిగితే ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుందని, అందుకు భిన్నంగా అక్రమ కల్లు అమ్మకాలపై నిషేధం, విషతుల్య పధార్థాలు కల్లులో వినియోగించకుండా చట్టం తేవడం కోసం సర్కారు చర్యలు చేపట్టాలని కోరారు. ఈ మేరకు ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, డీజీ(డ్రగ్స్), సహకార సంఘాల రిజిస్ట్రార్, ప్రెస్ అకాడమీ చైర్మన్, అమ్రిత ఫౌండేషన్ సొసైటీ , ఎక్సైజ్ కమిషనర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కమిటీ కల్లు విధానంపై ఇచ్చే నివేదిక , సూచనల ఆధారంగా కల్తీకల్లు నిరోధానికి చర్యలు చేపట్టాల్సి ఉంటుందన్నారు.