నీటి ఎద్దడి నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు
నిధులెంతైనా ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు
20 రోజుల్లో రూ. 6 కోట్లు మంజూరు చేశాం
ఏఈ, ఎమ్మార్వో, ఎంపీడీవోలు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి
చిత్తూరు(టౌన్): జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా నెలకొన్న తాగునీటి ఎద్దడి నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గీర్వాణి సంబంధిత అధికారులను కోరారు. గురువారం ఆమె జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలోని తన చాంబరులో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో తాగునీటి సమస్య రోజురోజుకూ ఎక్కువవుతోందన్నారు. వర్షాలు కురవని కారణంగా భూగర్భజలాలు అడుగంటడంతో బోర్లన్నీ ఎండిపోతున్నాయని చెప్పారు. కొత్తగా వేసే బోర్లలో కూడా నీరు రావడం లేదన్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు 918 గ్రామాల్లో సమస్య తీవ్రంగా ఉందన్నారు. 866 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని, 52 గ్రామాల్లో సమీపంలో ఉన్న బోర్లను టైఅప్ చేస్తూ నీటిని అందిస్తున్నామని చెప్పారు. వర్షాలు ఇలాగే ఉంటే రానున్న రెండు నెలల్లో సమస్య మరింత తీవ్రంకానున్నందున మండలాల్లోని ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు ప్రజలకు తాగునీరిచ్చేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎక్కడ సమస్య తలెత్తినా మండలాల్లోని సంబంధిత అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
గడచిన 20 రోజుల్లో జిల్లా ప్రజాపరిషత్ నుంచి రూ.6 కోట్లు మండలాలకు మంజూరు చేశామన్నారు. ఇంకనూ అవసరమైతే ఎంతైనా మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం కూడా హామీ ఇచ్చారని చెప్పారు. సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మండలాల్లోని ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు కూడా అధికారులకు సహకరించాలని ఆమె కోరారు. అవసరమైతే జెడ్పీ నుంచి మరిన్ని నిధులను మంజూరు చేస్తామని చెప్పారు.