మందుల ముఠా
సాక్షి, హన్మకొండ : ఔషధాల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేలా... నాణ్యత ప్రమాణాలపై నిఘా పెట్టేలా ప్రభుత్వం ఔషధ ధరల నియంత్రణ చట్టం తెచ్చింది. దీనికి మెడికల్ స్టోర్స్ యజమానులు తూట్లు పొడుస్తున్నారు. ముఠాగా ఏర్పడి చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. రోగాల ఆసరాతో సరికొత్త ఎత్తుగడలతో రోగుల జేబులకు చిల్లులు పెడు తూ లాభాలు ఆర్జిస్తున్నారు. మెడికల్ సిండికేట్ కారణంగా ఆస్పత్రుల పాలైన రోగులు మందులు కొనేందుకు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఒకే నాణ్యతా ప్రమాణాలతో తయారైన వస్తువుల ధరలు బహిరంగ మార్కెట్లో హెచ్చుతగ్గులతో ఉంటాయి.
వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఉత్పత్తి సంస్థలు ధరల్లో ఈ తేడాను పాటిస్తాయి. వినియోగదారులకు తమ కొనుగోలు శక్తి ఆధారంగా వస్తువులను ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. మెడికల్ దుకాణదారుల సిండికేట్ కారణంగా జిల్లాలో ఔషధాలు కొనుగోలు చేసే రోగులకు ఈ స్వేచ్ఛ లేకుండా పోయింది. మెడికల్ షాప్ నిర్వాహకులందరూ కలిసి ఎక్కడా... మందుల ధర తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు. మార్కెట్లో ఎవరైనా తక్కువ ధరకు ఔషధాలను అమ్మేందుకు ప్రయత్నిస్తే... వారికి జరిమానా వేస్తున్నారు. అంతేకాదు... తక్కువ ధరకు ఔషధాలు అమ్మే మెడికల్ షాప్‌లకు మందులు సరఫరా చేయొద్దని మెడికల్ ఏజెన్సీలకు హుకుం జారీ చేస్తున్నారు. మాట వినకుంటే వారి ఉత్పత్తులను జిల్లావ్యాప్తంగా అనధికారికంగా బ్యాన్ చేస్తున్నారు.
బెదిరింపుల పర్వం
ఏడాది కిందట ఎక్కువ డిస్కౌంట్ ఇస్తూ తక్కువ ధరకు ఔషధాలను అమ్ముతామంటూ నగరంలో ఓ మెడికల్ దుకాణం వెలిసింది. నగరంలో మిగిలిన మెడికల్ షాప్‌లలో కంటే తక్కువ ధరకు మందులు అమ్ముతుండడంతో రోగులు దీన్నే ఆశ్రయిస్తున్నారు. దీంతో మెడికల్ దుకాణాల సిండికేట్ ముఠా కన్ను దీనిపై పడింది. ఇలా అయితే తమ వ్యాపారం దెబ్బతిన్నట్లేనని భావించి సదరు ఔషధ విక్రయ దుకాణంపై కన్నెర్ర చేసింది. ఆ మెడికల్ స్టోర్‌కు మందులు సరఫరా చేయొద్దని వరంగల్ నగరంలో హోల్‌సేల్ ధరకు ఔషధాలు అమ్మే మెడికల్ స్టాకిస్టులు, ఏజెన్సీల నిర్వాహకులను ఆదేశించింది.
ముఠా మాట వినకుండా ఈ దుకాణానికి మందులు సరఫరా చేసినందుకు నలుగురు మెడికల్ స్టాకిస్టులకు ఇటీవల భారీ మొత్తంలో జరిమానా సైతం విధించింది. అంతేకాకుండా... రోగులకు డిస్కౌంట్ ఇస్తున్న మెడికల్ స్టోర్‌కు మందులు సరఫరా చేసే ఏజెన్సీకి సంబంధించిన ఔషధాలను జిల్లావ్యాప్తంగా బ్యాన్ చేయించింది. ఈ వ్యవహారాలను రాతపూర్వకంగా చేపడితే ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో... ఫోన్లలోనే బెదిరింపుల పర్వం కొనసాగిస్తోంది. వీరి బెదిరింపులకు భయపడి సదరు మెడికల్ స్టోర్‌కు మందులు సరఫరా చేసేందుకు స్టాకిస్టులు, ఏజెన్సీలు వెనకడుగు వేశాయి. దీంతో ఈ దుకాణాదారు హైదరాబాద్ నుంచి మందులు తెప్పించుకుంటున్నట్లు తెలిసింది.
పన్ను ఎగవేతలు కూడా...
జిల్లా వ్యాప్తంగా 2,500 మెడికల్ షాప్‌లు ఉండగా... వీటిలో సగానికి పైగా షాపుల్లో కంప్యూటరైజ్డ్ బిల్లు ఇవ్వడం లేదు. కేవలం తెల్లకాగితాలు, డాక్టర్ రాసిచ్చిన ప్రిస్కిప్షన్ వె నుకవైపు బిల్లులు రాసి ఇస్తున్నారు. దీనివల్ల మెడికల్ షాప్‌ల నిర్వాహకులు ప్రభుత్వానికి చె ల్లించాల్సిన పన్ను తగ్గుతోంది. అంతేకాదు... మందుల తయారీదారులు ఇచ్చే డిస్కౌంట్లు సైతం గాల్లో కొట్టుకుపోతున్నాయి. మొత్తానికి మెడికల్ సిండికేట్వ్యవహారం కారణంగా జిల్లాలో ఔషధాల ధరలు చుక్కలనంటుతున్నాయి.