8 శాతం తగ్గిన సహజవాయువు ధర
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా రేట్లు తగ్గుతున్న నేపథ్యంలో దేశీయంగా ఉత్పత్తి చేసే సహజ వాయువు (గ్యాస్) ధరలను 8% మేర తగ్గిస్తూ చమురు శాఖలో భాగమైన పెట్రోలియం ప్లానిం గ్ అండ్ అనాలిసిస్ సెల్(పీపీఏసీ) మంగళవారం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం 5.05 డాలర్లుగా ఉన్న మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్ (ఎంబీటీయూ) గ్యాస్ ధర ఇకపై 4.66 డాలర్లకు తగ్గుతుంది. విద్యుత్, ఎరువుల ఉత్పత్తికి ప్రయోజనకరంగా ఉండనున్న ఈ రేటు ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 దాకా అమల్లో ఉంటుంది. గ్యాస్ నాణ్యతకు కొలమానమైన స్థూల కెలోరిఫిక్ విలువ (జీసీవీ) ఆధారంగా ఈ ధర నిర్ణయించారు. గ్యాస్ ఉత్పత్తి చేసే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఆర్ఐఎల్ వంటి సంస్థల ఆదాయాలపై ప్రతికూల ప్రభా వం పడనుంది. ఈ విధంగా గ్యాస్ రేట్లు తగ్గిం చడం ఇదే తొలిసారి కానుంది. గతేడాది అక్టోబర్లో రూపొందించిన ఫార్ములా ప్రకారం ప్రతి ఆరు నెలలకోసారి ధరలను సవరిస్తున్నారు.