9,000 మందికో వైద్యుడు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ప్రభుత్వ వైద్యుల కొరత వేధిస్తోంది. వైద్యారోగ్య రంగానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా సిబ్బంది నియామకంపై దృష్టి సారించకపోవడంతో వైద్యుల కొరత తీరడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం ప్రతి 1,000 మందికి ఓ ప్రభుత్వ వైద్యుడు ఉండాలి. కానీ తెలంగాణలో 9,343 మందికి ఓ వైద్యుడు ఉన్నాడు. మొత్తంగా రాష్ట్రంలో 4,123 మందే సర్కారు వైద్యులున్నారు. వీరుగాకుండా 201 మంది దంత వైద్యులున్నారు. అంటే ప్రతి 1.91 లక్షల మందికి ఓ దంత వైద్యుడన్నమాట.
కేంద్రం ఇటీవల విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య మానవ వనరుల నివేదిక–2018 ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. వైద్యుల విషయంలో ఈశాన్య రాష్ట్రాలతో పోల్చినా రాష్ట్రం వెనుకబడి ఉన్నట్లు నివేదిక పేర్కొంది. సిక్కింలో ప్రతి 2,437 మందికి, మిజోరంలో 2,358 మందికి ఓ వైద్యుడున్నట్లు వెల్లడించింది. తమిళనాడుతో పోలిస్తే మాత్రం తెలంగాణ ముందుంది. అక్కడ 9,544 మందికి ఓ వైద్యుడున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోనైతే 10,189 మందికి ఓ వైద్యుడున్నాడు. బిహార్ రాష్ట్రం అత్యంత వెనుకబడి ఉంది. అక్కడ 28,391 మందికి ఓ ప్రభుత్వ వైద్యుడున్నాడు. అదే అమెరికాలో ప్రతి 200 మందికి ఓ వైద్యుడు ఉన్నాడు.
నియామకాల్లేవు.. కొత్త పోస్టుల్లేవు
రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇటీవల కేసీఆర్ కిట్ ప్రవేశపెట్టాక ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు 13 శాతం పెరిగాయి. 2016 జూన్ నుంచి 2017 మే మధ్య 2,21,530 ప్రసవాలు జరగ్గా.. ‘కిట్’ప్రవేశపెట్టాక తొలి ఏడాదిలో 3,07,497 ప్రసవాలు జరిగాయి. మరోవైపు డయాలసిస్ యూనిట్లు కూడా నెలకొల్పుతున్నారు. ఆస్పత్రులను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. త్వరలో ‘కంటి వెలుగు’కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఓవైపు ఇలాంటి కీలక కార్యక్రమాలు చేపడుతున్నా మరోవైపు వైద్య సిబ్బంది ఖాళీల భర్తీ కానీ, కొత్త పోస్టుల మంజూరుగానీ జరగడం లేదు. రెండ్రోజుల క్రితం ఏరియా, సామాజిక, జిల్లా ఆస్పత్రుల కోసం 919 మంది స్పెషలిస్టు వైద్యుల భర్తీ జరిగింది. కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిస్థితి మెరుగుపడాల్సి ఉంది.
5 వేల పోస్టులు ఖాళీ
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 1,318 మంజూరు వైద్యుల పోస్టులుండగా 294 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో (సీహెచ్‌సీ) 226 మంజూరు వైద్య పోస్టులుంటే 197 మందే ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సీహెచ్‌సీల్లో 1,666 స్టాఫ్ నర్సులకుగాను కేవలం 1453 మందే ఉన్నారు. సీహెచ్‌సీల్లో 71 రేడియోగ్రాఫర్స్‌కు 28 మందే పని చేస్తున్నారు. పీహెచ్సీ, సీహెచ్‌సీల్లో 928 ఫార్మసిస్టులకు 691 మంది ఉండగా.. వాటిల్లో 765 లేబరేటరీ టెక్నీషియన్ల పోస్టులకు 566 మంది పని చేస్తున్నారు. సిబ్బంది కొరత తీర్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా అవి పూర్తిస్థాయిలో ఆచరణలోకి రాలేకపోతున్నాయని ఆరోపణలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 వేల ఖాళీలున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల 1,000 వరకు పోస్టులు భర్తీ చేయడంతో ఖాళీల సంఖ్య 5 వేలకు తగ్గింది.
12 శాతం మందే సర్కారుకు..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసేందుకు వైద్యులు ఆసక్తి చూపించడం లేదన్న ఆరోపణలున్నాయి. కేవలం 12 శాతం మందే ప్రభుత్వ ఆస్పత్రుల్లోకి వస్తున్నారు. ప్రభుత్వ వైద్య రంగంలో తక్కువ వేతనం, మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం, తక్కువ పోస్టులే ఇందుకు కారణమని కేంద్రం విశ్లేషించింది. దేశంలో అనేక రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో తక్కువ వేతనాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు చెబుతున్నారు. కేరళలో బోధనేతర అసిస్టెంట్ సర్జన్‌కు రూ.లక్ష, సివిల్ సర్జన్‌కు రూ. 1.80 లక్షలు వేతనాలిస్తుంటే.. తమిళనాడులో అదే కేటగిరీకి రూ. 90 వేలు, రూ. లక్షన్నర చొప్పున ఇస్తున్నారు. తెలంగాణలో మాత్రం రూ. 65 వేలు, రూ. లక్ష ఇస్తున్నారు. బోధనాసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చత్తీస్‌గఢ్‌లో వైద్యుల బేసిక్ శాలరీలో 25 శాతం గ్రామీణ అలవెన్సు ఇస్తుంటే తెలంగాణలో రూ. 2 వేలు ఇస్తున్నారు. పోస్టుమార్టం అలవెన్సు పంజాబ్‌లో ఒక్కో కేసుకు రూ. 1,000.. కేరళ, తమిళనాడుల్లో రూ. 600 చొప్పున ఇస్తుండగా రాష్ట్రంలో ఒక్క పైసా ఇవ్వడం లేదు. ఇక 29 రాష్ట్రాల్లో 26 రాష్ట్రాలు నిర్ణీత సమయంలోనే పదోన్నతులు ఇస్తున్నాయి. తెలంగాణ, పశ్చిమబెంగాల్, అస్సాంలలో అలా జరగడం లేదు. మరోవైపు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడానికి కూడా వైద్యులు విముఖత చూపిస్తున్నారు.
––––––––––––––––––––––––––––––––––––
వివిధ రాష్ట్రాల్లో ఒక్కో ప్రభుత్వ వైద్యుడికి జనాభా
–––––––––––––––––––––––––––––––––––––
రాష్ట్రం జనాభా
–––––––––––––––––––––––––––––––––––
1) తెలంగాణ 9,343
2) ఆంధ్రప్రదేశ్ 10,189
3) అరుణాచల్‌ప్రదేశ్ 2,417
4) అస్సాం 5,395
5) బీహార్ 28,391
6)చత్తీస్‌గఢ్ 15,916
7) గోవా 3,883
8) గుజరాత్ 11,475
9) హరియాణా 10,189
10) జమ్మూ కశ్మీర్ 3,060
11) కర్ణాటక 13,556
12) కేరళ 6,810
13) మహారాష్ట్ర 16,996
14) మణిపూర్ 2,358
15) పంజాబ్ 9,817
16) రాజస్థాన్ 10,976
17) తమిళనాడు 9,544
18) త్రిపుర 3,038
19) ఉత్తరప్రదేశ్ 19,962
20) పశ్చిమబెంగాల్ 10,411