చదువుల భారం చేస్తాడట దూరం!
విద్య అనేది విజ్ఞానాన్ని పెంచాలి. కానీ నేటి విద్య... ఒత్తిడిని పెంచుతోంది. వీపు మీద పుస్తకాల బరువును పెంచుతోంది. టెక్స్ట్ బుక్స్ బట్టీ పట్టాలి. వర్క్బుక్కులతో కుస్తీ పట్టాలి. హోమ్‌వర్కులు, స్లిప్ టెస్టులు... ఉరుకులు, పరుగులు. ఇదీ నేటి విద్యావిధానం. ఒత్తిడి పెంచే ఈ తరహా చదువులు అవసరమా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. కానీ ఏ ఒక్కరైనా దీనికి పరిష్కారాన్ని ఆలోచించారా? కమలేష్ జపాడియా ఆలోచించాడు. ఓ టీవీ కార్యక్రమం స్ఫూర్తితో మన దేశంలోని విద్యావిధానాన్నే మార్చేయాలని చూస్తున్నాడు. మార్చి తీరుతానని సవాల్ చేస్తున్నాడు.
పొద్దున్న పది గంటలకు బడికెళ్లి, మూడింటి వరకూ పాఠాలు విని, ఆపైన ఓ గంట ఆటలాడి, నాలుగింటికి ఇంటికొచ్చేసేవాళ్లు ఒకప్పుడు విద్యార్థులు. కానీ ఇప్పుడు పొద్దున్న ఏడింటికల్లా బడిలో ఉండాలి. సాయంత్రం వరకూ పాఠాలు వింటూనే ఉండాలి. బడి అయ్యాక మళ్లీ అదనపు తరగతులు. ఆడుకోవడానికి ఓ అరగంట సమయం కూడా చిక్కదు. ఇది పిల్లల మనసులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని బాధపడ్డాడు కమలేష్. ఈ పరిస్థితి కారణం వారికి ఏర్పరచిన సిలబస్. ముందు దాన్ని మార్చాలి అనుకున్నాడు. అందుకుగాను ఎవ్వరూ ఊహించని ఓ సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు.
టీవీ షో స్ఫూర్తితో...
గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన కమలేష్ జపాడియా (35) ప్రైమరీ స్కూల్ టీచర్. అందరు ఉపాధ్యాయుల్లాగే పిల్లలకు పాఠాలు బోధించినా... అందరిలాగా నేటి విద్యావిధానాన్ని అంగీకరించలేకపోయాడు కమలేష్. చదువుల పేరుతో పిల్లల అందమైన బాల్యాన్ని హరిస్తున్నామంటూ వేదన చెందేవాడు. ఓసారి ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ చూస్తుండగా ఓ ఆలోచన వచ్చింది. ‘పిల్లల పాఠాలన్నీ ఆ ప్రోగ్రామ్లోలాగా బిట్ ఫార్మేట్లోకి మార్చేస్తే’... అనుకున్నాడు. తన ఆలోచన తనకే గొప్పగా అనిపించింది. కానీ ఇతరులు మాత్రం నవ్వారు. ‘పాఠాలన్నీ బిట్స్లాగా ఎలా మారుస్తాం, అదేమైనా చిన్న పనా’ అంటూ ఎగతాళి చేశారు. కానీ కమలేష్ ఫీలవలేదు. అనుకున్నది చేసి తీరాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగాడు.
కమలేష్ ఉండే చోట అందుబాటులో ఇంటర్నెట్ లేదు. దాంతో రోజూ ఇరవై కిలోమీటర్లు ప్రయాణించి ఇంటర్నెట్ కేఫ్‌కు వెళ్లేవాడు. తన ఆలోచనను అమలు చేసే పనుల్లో మునిగిపోయేవాడు. ఎట్టకేలకు ‘ఎడ్యుసఫర్’ అనే వెబ్‌సైట్‌ను రూపొందించాడు. 1 నుంచి 10వ తరగతి వరకూ అన్ని సబ్జెక్టులనూ బిట్స్ రూపంలోకి మార్చేసి, తన వెబ్సైట్లో అప్లోడ్ చేశాడు. వాటిని డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించాడు. త్వరలో ఒక ‘ఆప్’ని కూడా రూపొందించబోతున్నాడు.
కమలేష్ పట్టుదల చూసి మొదట నవ్వినవారే ఇప్పుడు శభాష్ అంటున్నారు. అహ్మదాబాద్ ఐఐటీ కమలేష్ వెబ్‌సైట్‌ని చూసి ప్రశంసలు కురిపించింది. గుజరాత్ ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అతడిని సన్మానించింది. అయితే తనకు కావాల్సింది సన్మానాలు, ప్రశంసలు కాదంటాడు కమలేష్. ‘నా మెటీరియల్‌ని మన దేశంలోని అన్ని పాఠశాలలూ వినియోగించాలి.
ఒత్తిడి లేని చదువుని పిల్లలకు అందించిననాడు నా శ్రమకు తగిన ఫలితం దక్కినట్టే’ అంటాడు కమలేష్.నిజమే. కమలేష్ ఆలోచన చాలా గొప్పది. దాన్ని అమలు చేసిన రోజున మన దేశంలోని విద్యా విధానం మారిపోతుంది. చదువుల భారం తగ్గి మన పిల్లల బాల్యమూ వికసిస్తుంది.